హైకోర్టులో తెలుగులో తీర్పు
ABN , First Publish Date - 2023-06-30T03:32:49+05:30 IST
: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తెలుగు భాషలో తీర్పు వెలువరించింది.
● వెలువరించిన జస్టిస్ నవీన్‌రావు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తెలుగు భాషలో తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్ మచ్చబొల్లారానికి చెందిన కౌకుంట్ల వీరారెడ్డి ఇద్దరు కుమారులు కె.చంద్రారెడ్డి, కె.ముత్యంరెడ్డిల మధ్య 2005 నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ వివాదంపై రంగారెడ్డి జిల్లా కోర్టు 2011లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై చంద్రారెడ్డి 2012లో హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం అప్పీల్‌ను కొట్టేస్తూ జస్టిస్ నవీన్‌రావు ధర్మాసనం తాజాగా 45 పేజీల తీర్పును తెలుగులో వెలువరించింది. తమ తల్లికి సంబంధించిన 4.8 ఎకరాల భూమి విషయంలో వీలునామా ఉందని.. దాన్ని అమలు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. వీలునామా కంటే ముందే వాది, ప్రతివాదుల తల్లి తన భూమిని సమానంగా ఇద్దరికీ పంపిణీ చేసిందని, ఆ కారణంగా వీలునామా చెల్లదని స్పష్టం చేసింది. అంతకు ముందు జరిగిన పంపకాల ప్రకారం ఆస్తి అన్నదమ్ములిద్దరికీ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. 45 పేజీల ఈ తీర్పులో అత్యంత సంక్లిష్టమైన సాక్ష్యాధారాలను.. సుప్రీంకోర్టు తీర్పులను జస్టిస్ నవీన్‌రావు తెలుగులో రికార్డు చేయడం గమనార్హం..! కక్షిదారులు, ప్రజల సౌకర్యార్థం తెలుగులో తీర్పునిస్తున్నట్లు జస్టిస్ నవీన్‌రావు స్పష్టం చేశారు.