గుండెకు ఊపిరిపోయడానికీ.. సంకోచమే!
ABN , First Publish Date - 2023-03-02T02:37:23+05:30 IST
కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్).. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని అప్పటికప్పుడు ప్రాణాపాయం నుంచే కాపా డే ప్రక్రియ. అయితే దీనిపై జనాల్లో ఉన్న అపోహలతో ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది.
సీపీఆర్ తెలిసినా చేసేందుకు వెనుకంజ
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్).. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని అప్పటికప్పుడు ప్రాణాపాయం నుంచే కాపా డే ప్రక్రియ. అయితే దీనిపై జనాల్లో ఉన్న అపోహలతో ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది. అకస్మాత్తు గా గుండెపోటుకు గురైన వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే సడన్ కార్డియాక్ అరెస్టయితే సీపీఆర్ చేయని ఘటనలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని అంటున్నారు. అందు కు బలమైన కారణమే ఉంది. సడన్ కార్డియాక్ అరెస్టయిన వారి ఛాతీపై బలంగా, వేగంగా చెస్ట్ రెండు అంగుళాలు లోపలికి వెళ్లేలా నొక్కాలి. సీపీఆర్ వల్ల గుండె ప్రతిస్పందనలు తిరిగి మొదలవుతాయి. కానీ అలా బలంగా నొక్కడం వల్లే తమ వాడు చనిపోయాడనే వాదించిన వా రూ ఉన్నారని కొందరు కార్డియాలజిస్టులు అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీపీఆర్ చేయడానికి సంకోచిస్తున్నారంటున్నారు. విదేశాల్లో ఇటువంటి అపోహల నుంచి వారెప్పుడో బయటపడ్డారని, మన దగ్గర మాత్రం ఇటువంటివి ఇంకా ఉన్నాయంటున్నారు. అందుకే సీపీఆర్ గురించి తెలిసినా చేయడానికి వెనకడుగు వేయాల్సి వస్తోందంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో కొంచెం మార్పు వచ్చిందంటున్నారు. కాగా, సీపీఆర్ శిక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీసీఎల్) దీన్ని ఎవరైనా ఒక రోజులోనే నేర్చుకోవచ్చు. రెండోది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఈసీఎల్).. దీన్ని కేవలం మెడికల్ ప్రొఫెషనల్సేచేయగలుగుతారు. అలాగే సీపీఆర్ శిక్షణ మ్యాన్‌కిల్ అనే ఒక ఎలాస్టిక్ కంప్రెషన్స్ మోడల్‌పైనే చేయిస్తారు. ఛాతీ భాగంలో ఎడమ చేతిపై కుడి చేతిని పెట్టి నిమిషానికి కనీసం 100 నుంచి 120 సార్లు గట్టిగా నొక్కాలి. అలా నొక్కినప్పుడు ఛాతీ కనీసం రెండు అంగుళాలు లోపలకి వెళ్లాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే సాధారణ వ్యక్తులపై సీపీఆర్ కోసం ఛాతీపై నొక్కితే ప్రాణాలు పోతాయి. అందుకే మ్యాన్‌కిల్ మోడల్‌పై చేయిస్తారు.