ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు పిటీషన్‌పై నేడు విచారణ

ABN , First Publish Date - 2023-03-02T01:03:39+05:30 IST

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 2వ తేదీన (గురువారం) హైకోర్టులో విచారణ జరగనుంది. రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం పరిధిలోని రాయిగిరి రైతులు తుది ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు పిటీషన్‌పై నేడు విచారణ

గత నెల 15న హైకోర్టును ఆశ్రయించిన రైతులు

భువనగిరి రూరల్‌, మార్చి 1: రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 2వ తేదీన (గురువారం) హైకోర్టులో విచారణ జరగనుంది. రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం పరిధిలోని రాయిగిరి రైతులు తుది ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే మూడు దఫాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫీడర్‌ ఛానల్‌, హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి, హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు భూములు కోల్పోయామని ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో పూర్తిగా జీవనాధారం కోల్పోతున్నామని, అలైన్‌మెంట్‌ మార్చాలని పలు దఫాలుగా ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్‌ ముట్టడి, జాతీయ రహదారిపై రాస్తారోకోతోపాటు పలు విధాలుగా నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, వలిగొండ, భువనగిరి మునిసిపాలిటీ, భువనగిరి మండలం, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో రీజనల్‌ రింగురోడ్డు నిర్మించనున్నారు.

ఇందుకోసం 1,852.04 ఎకరాల భూమిని సేకరించేందుకు రైతుల ప్రమేయం లేకుండా పోలీసు పహారాలో రెవెన్యూ, సర్వే అధికారులు బలవంతంగా సర్వే చేపట్టారు. ఈక్రమంలో మనోవేదనతో అస్వస్థతకు గురై రాయిగిరికి చెందిన మహిళా రైతు బొజ్జ లక్ష్మి, బాలంపల్లికి చెందిన రైతు మద్దూరి రఘునందన్‌రెడ్డి రెండు నెలల క్రితం ప్రాణాలు కోల్పోయారు. 2022 మార్చిలో జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కాకుండా 2023 ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం భూ సేకరణ చేయడాన్ని సవాల్‌చేస్తూ రాయిగిరికి చెందిన 29 మంది రైతులు న్యాయవాది బ్రహ్మదండి రమేష్‌ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. అదే రోజు భూ నిర్వాసితుల పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఫిబ్రవరి 17న విచారణ చేపట్టింది. పూర్తి వివరాలకోసం కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయటంతో మార్చి 2న సమగ్ర నివేదికతో పూర్తి సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ పిటీషన్‌కు సంబంధించి గురువారం విచారణ జరుగనుందని నిర్వాసితులు తంగెళ్లపల్లి రవికుమార్‌, అవిశెట్టి పాండు యాదవ్‌, భద్రయ్య, మల్లేష్‌ తెలిపారు.

Updated Date - 2023-03-02T01:03:39+05:30 IST