Share News

అయ్యప్ప సన్నిధికి వెళ్లొస్తూ మృత్యువాత

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:45 AM

తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు.

అయ్యప్ప సన్నిధికి వెళ్లొస్తూ  మృత్యువాత

తమిళనాడులో రోడ్డు ప్రమాదం

ముగ్గురు ములుగు జిల్లా వాసుల మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మంగపేట, డిసెంబరు 17: తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన సుబ్బయ్యనాయుడు, నర్రా సాంబయ్య, నిమ్మల వెంకటరాజు, అజయ్‌, రాములు, మరికొందరు భక్తులు ఇరుముడులు కట్టుకుని ఈ నెల 14న శబరిమల వెళ్లారు. అయ్యప్ప దర్శనం తర్వాత ఈ ఐదుగురు కలిసి ఆదివారం ఓ కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని పెరియాకుళం మండలం దేవనపట్టి బైపాస్‌ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సుబ్బయ్యనాయుడు, వెంకటరాజు, సాంబయ్య అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌, రాములును స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన ముగ్గురు ఒకేసారి మరణించడంతో కమలాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుబ్బయ్యనాయుడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, వెంకటరాజుకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 02:45 AM