పీవీపై హరీశ్ ప్రేమ ఆశ్చర్యకరం
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:21 AM
కాంగ్రెస్ వాది పీవీ. నర్సింహరావుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు ప్రేమ ఒలకబోయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీ నీటిని తీసుకుపోతుంటే ఏం చేశారు?
స్వార్థ రాజకీయాలతో ఏడు మండలాలు పోగొట్టారు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు
పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మాట్లాడొద్దా?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ వాది పీవీ. నర్సింహరావుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు ప్రేమ ఒలకబోయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీవీ సీఎంగా, పీఎంగా పనిచేశారని... ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్‌లో చేపట్టాలని కుటుంబసభ్యులే కోరారని... ఆమేరకు అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో చేశారని గుర్తు చేశారు. అయితే బీఆర్‌ఎస్ నేతలు పీవీ విషయమై ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే బీఆర్‌ఎస్ నేతలు.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా మౌనంగా వున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం భద్రాచలానికి చెందిన ఏడు మండలాలు కోల్పోయామన్నారు. కాళేశ్వరం అవినీతిని బయటపెడతామన్నారు. మాజీ ప్రధాని, పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసిన అన్యాయంపై మాట్లాడొద్దా..? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. పీవీపై ఎందుకంత ప్రేమ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.