Share News

ఆహ్లాదం మాటున విషాదం

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:46 PM

సద్దుల చెరు వు.. ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం. దాని మాటున విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి.

ఆహ్లాదం మాటున విషాదం
సూర్యాపేట జిల్లాకేం ద్రంలోని సద్దుల చెరువు

ఆత్మహత్యలకు అడ్డాగా సద్దుల చెరువు

క్షణికావేశంతో చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటున్న వైనం

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదుగురు ఆత్మహత్య

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 26: సద్దుల చెరు వు.. ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం. దాని మాటున విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రం లో సాయంత్రం వేళా కుటుంబసభ్యులు పిల్లాపాపల తో వచ్చి సద్దుల చెరువు వద్ద కాలక్షేపం చేస్తుంటారు. కొందరు చెరువులో బోటు ఎక్కి విహరిస్తారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్న సద్దుల చెరువు ఆత్మహత్యలకు అడ్డాగా మారడం ఆం దోళన కలిగించే విషయం. మానసికోల్లాసం కోసం తీరిక సమయంలో చెరువు వద్దకు వచ్చే ప్రజలకు చెరువులో తేలియాడే మృతదేహాలు ఇబ్బందికరంగా మారాయి. పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ ల్లో సద్దుల చెరువు వద్ద ఉదయం నడిచేందుకు చేస్తున్నారు. అదే విధంగా సద్దుల చెరువును మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి సుమారు రూ.20కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ కొంత మంది వా రి సమస్యల కారణంగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుం టున్నారు. రాత్రిసమయంలో పోలీసులు గస్తీ పెంచితే అసాంఘీక కార్యక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. రాత్రి వేళలో కొంతమంది యువకులు మద్యం, గంజాయి తీసుకుంటున్నట్లు పట్టణంలో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా సద్దుల చెరువు వద్ద రక్షణ చర్యలు ఏర్పాటు చేసి ఆత్మహత్యలను నివారిస్తే బాగుంటుందని పట్టణవాసులు అభి ప్రాయపడుతున్నారు.

ఇటీవల మహిళ ఆత్మహత్యాయత్నం

ఇటీవల విజయవాడకు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో సద్దుల చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోగా సమీపంలో ఉన్న యువకుడు చెరువులోకి దూకి ఆమెను రక్షించాడు. జిల్లాకేంద్రానికి చెందిన ఓ యువతి ఇటీవల ఇంట్లో చిన్న సమస్యలు తలెత్తడంతో సద్దుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రెండు నెలలకు ఒక ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఆత్మహత్యలకు అడ్డగా సద్దుల చెరువు మారింది. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో ట్యాంక్‌బండ్‌లో దూకుతున్నట్లు తెలుస్తుంది. ఒక రోజు గడిచిన తర్వాత మృతదేహాలు బయటకు కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు సద్దుల చెరువు సమస్యలతో ఉండేది. చెరువు కట్ట వెంట కంపచెట్లు విరివిగా పెరిగి ఉండేవి. అంతేకాకుండా అనేక అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు రూ.20కోట్లతో సద్దుల చెరువును అన్ని విధాలుగా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మినీ ట్యాంక్‌బండ్‌గా మారడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద ఎత్తున చెరువు వద్దకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేస్తున్నారు.

పోలీసుల నిఘా కరువు

సద్దుల చెరువు వద్ద పోలీసుల నిఘా కరువవుతోంది. చెరువు కట్టపై అసాంఘీక కార్యక్రమాలను అడ్డుకునేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక కొన్నాళ్ల పాటు రాత్రి సమయంలో సద్దుల చెరువు ట్యాంక్‌ బండ్‌పై పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం పెట్రోలింగ్‌ చేయడం కనిపించడం లేదు. చెరువుకు ఎక్కువగా పట్టణం వైపున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకోసం ప్రజలు చెరువులోకి వెళ్లే ప్రదేశాలను తగ్గిస్తూ చెరువులోకి దూకకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తే కొంతమేర అరికట్టే అవకాశం ఉంది. పట్టణంలోని సద్దుల చెరువులో ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:46 PM