Revanth Reddy: హై హై నాయకా!
ABN , First Publish Date - 2023-12-06T03:52:19+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది.
హైకమాండ్ ఆమోదం.. రేపే ప్రమాణం
రేవంత్ పేరు ఖరారుపై ఖర్గే నివాసంలో కసరత్తు
ఆయన సమర్థుడు, అతడే సీఎం.. తేల్చి చెప్పిన రాహుల్
ఏఐసీసీ కార్యాలయంలో మీడియా ముందు
అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రకటించిన కేసీ వేణుగోపాల్
6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలోనే ప్రకటన
మంత్రివర్గ కూర్పు కోసం ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌రెడ్డి
7న ప్రమాణ స్వీకారంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌లో ఎల్లా హోటల్ వద్ద కార్యకర్తల హల్‌చల్
న్యూఢిల్లీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా భావించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలను తన పక్కనే కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్రకటన చేశారు. రేవంత్ ప్రమాణ స్వీకారం గురువారం ఉంటుందని వేణుగోపాల్ వెల్లడించారు. ఎంతో క్రియాశీలకంగా, ప్రభావవంతంగా వ్యవహరించే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నేతలతో కలిసి ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తారని, సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.15కు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు, మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానంతో చర్చించటానికి రేవంత్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ అగ్రనాయకులు ఖర్గే, సోనియా, రాహుల్ తదితరులతోపాటు ఇండియా కూటమి పార్టీల అధినేతలను కూడా రేవంత్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేయటానికి ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యారు. ఆ భేటీ గంటపాటు కొనసాగింది.
హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, ఎమ్మెల్యేల్లో అత్యధికులు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ప్రతిపాదించటం మొదలైన పరిణామాలపై వారు చర్చించారు. అనంతరం, అక్కడికి పార్టీ తెలంగాణ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే తదితరులను రాహుల్‌గాంధీ పిలిపించారు. వారు వచ్చిన తర్వాత.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్ని విధాల అర్హుడు, ఆయననే ముఖ్యమంత్రిగా చేద్దాం అని రాహుల్ గాంధీ తెలిపారు. రేవంత్‌ను సీఎంగా నిర్ణయించాం అని చెప్పి కొద్దిసేపటికే వెళ్లిపోయారు. కాగా రేవంత్ పేరు నిర్ణయమైన తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలను కేసీ వేణుగోపాల్ తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. అనంతరం, వారిద్దరితో కలిసి ఆయన కారులో ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. వారితో కలిసే అక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశం, నివేదిక తదితర అంశాలను కేసీ వేణుగోపాల్ ప్రస్తావించారు. ‘సీఎల్పీ సమావేశంలో పార్టీ పరిశీలకులు డీకే శివకుమార్ ఠాక్రే, మురళీధరన్, జార్జి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులను అభినందించడంతోపాటు సీఎల్పీ నేతను నిర్ణయించే బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పజెబుతూ ఆ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం మధ్యాహ్నం డీకే శివకుమార్, ఠాక్రే.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలుసుకుని హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం గురించి నివేదిక సమర్పించారు’ అని వేణుగోపాల్ తెలిపారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుని, సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని నియమించాలని ఖర్గే నిర్ణయించారని వెల్లడించారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తారని, సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం గురువారం ఉంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తోపాటు డీకే శివకుమార్, ఠాక్రే, ఉత్తమ్, భట్టి పాల్గొన్నారు.
సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి ప్రయత్నాలు
సీఎంగా రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించటానికి ముందు.. ఆ పదవికి తమ పేరును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తమ ప్రయత్నాలు కొనసాగించారు. కర్ణాటక భవన్‌లో డీకే శివకుమార్‌ను ఉత్తమ్ కలిసి మాట్లాడారు. తమ ప్రాంతంలో అన్ని స్థానాలను గెలుచుకున్నామని, తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, కాబట్టి ముఖ్యమంత్రిగా తన పేరును పరిశీలించాలని ఆయన చెప్పినట్లు సమాచారం. మరోవైపు, భట్టి విక్రమార్క మహారాష్ట్ర భవన్‌లో మాణిక్‌రావు థాక్రేను కలుసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశానని కాబట్టి, సీఎం పదవికి తన అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఖర్గే నివాసంలో సమావేశం అనంతరం రాహుల్ వెళ్లిపోయిన తర్వాత.. వేణుగోపాల్, డీకే, థాక్రే తదితరులు చర్చలను కొనసాగించారు. సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి చేస్తున్న ప్రయత్నాల గురించి, వారిని బుజ్జగించడం గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో, కేసీ వేణుగోపాల్.. భట్టి, ఉత్తమ్‌లను తన ఇంటికి పిలిపించి వారితో మాట్లాడారు. మంత్రిత్వశాఖల్లో ఏది కావాలో కోరుకోండి అని వారికి ఆయన చెప్పినట్లు సమాచారం. అంతకుముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వేణుగోపాల్, థాక్రేలతో చర్చలు జరిపానని, తాను సీఎం పదవిని కోరుకోవడంలో తప్పులేదని పేర్కొన్నారు. అయితే, అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని స్పష్టం చేశారు.
ఢిల్లీకి రేవంత్.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు
అధిష్ఠానం పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి మంగళవారం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్.. రేవంత్‌కు స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. కానీ, రేవంత్ ప్రొటోకాల్ వద్దని తన కారులోనే వెళ్లిపోయారు. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం 10.15 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, సోనియాతోపాటు ఇండియా కూటమి పార్టీలనేతలను కూడా ఆహ్వానించనున్నారు.
7న రేవంత్ ప్రమాణ స్వీకారం ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 7వ తేదీన ఉదయం పది గంటలకు గవర్నర్ తమిళిసై సమక్షంలో రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయనున్నట్లు ఆంధ్రజ్యోతి ముందే తెలిపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు తేదీని ఖరారు చేసిందని, మంగళ బుధ వారాలు మంచిరోజులు కానందున 7న ప్రమాణ స్వీకారానికి నిర్ణయించిందని మంగళవారం నాటి సంచికలో వెల్లడించింది. ఆంధ్రజ్యోతి ముందుగానే చెప్పినట్లుగానే.. 7వ తేదీన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.