Share News

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:01 AM

క్రిస్మస్‌ వేడుకలు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు రాకను ఆహ్వానిస్తూ ఆదివారం అర్ధరాత్రే చర్చీల్లో వేడుకలు ప్రారంభించారు.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
భువనగిరిలో కేక్‌ కట్‌చేసి చర్చి ఫాదర్‌కు తినిపిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

క్రిస్మస్‌ వేడుకలు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు రాకను ఆహ్వానిస్తూ ఆదివారం అర్ధరాత్రే చర్చీల్లో వేడుకలు ప్రారంభించారు. చర్చి ఫాదర్లు బైబిల్‌ పఠనలు, దైవ ప్రార్థనలు, క్రీస్తు ప్రవచనాలు చేశారు. క్రైస్తవ భక్తులు క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. కేక్‌ కట్‌చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు. పశువుల పాకలో బాల ఏసు జన్మించిన వృత్తాన్ని చిన్నారులు నాటకం రూపంలో ప్రదర్శించారు. పలుచోట్ల పేదలకు రగ్గులు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు.

ఏసు ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలి : విప్‌ అయిలయ్య

ఆలేరురూరల్‌, యాదగిరిగుట్ట రూరల్‌: త్యాగం, మానవత్వం కలబోతే యేసుక్రీస్తు అని, ఏసు ఆశీస్సులతో అంతా సుఖశాంతులతో ఉండాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రం ఆలేరుతో పాటు కొలనుపాక, గుండ్లగూడెం, యాదగిరిపల్లిలోని పలు చర్చీల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి శాంతిని, ప్రేమను అందించిన దేవుడు ఏసుక్రీస్తు అని కొనియాడారు. క్రిస్మస్‌ పండుగ ప్రతీ ఒక్కరిలో సోదర భావాన్ని పెంపొందింపజేయాలని అన్నారు. క్రీస్తు బోధించిన మార్గంలో నడిచి సమాజ ఉన్నతికి పాటుపడాలన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్‌రాజు, ఎంఏ ఎజాజ్‌, డాక్టర్‌ కె ప్రభాకర్‌, ఎంఎస్‌ విజయ్‌కుమార్‌, ఇసాక్‌, కంతి దాసు, విజయ్‌, డానియల్‌, ప్రకాష్‌, కరుణాకర్‌, కానుగు బాలరాజ్‌గౌడ్‌, కౌన్సిలర్‌ ముక్కెర్ల మల్లేశం, బందాపు భిక్షపతిగౌడ్‌, ఆకుల గణేష్‌, బూడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఏసు మార్గంలో పయనించాలి : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి టౌన: ఏసు క్రీస్తు చూపిన మార్గంలో అంతా పయనించాలని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం క్రిస్మస్‌ సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్‌ కట్‌చేశారు. క్రైస్తవులకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని అన్ని చర్చీల్లో ఉదయం నుంచే క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Dec 26 , 2023 | 12:01 AM