Governor vs Pragathibhavan: గవర్నర్‌ వర్సెస్‌ ప్రగతిభవన్‌ కొత్త పంచాయితీ

ABN , First Publish Date - 2023-05-02T15:06:44+05:30 IST

రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan Pragati Bhavan) మద్య పంచాయతీ ముగిసిందని అందరూ అనుకున్నారు. గవర్నర్​ తమిళి సై (Governor Tamilisai​), సీఎం కేసీఆర్​ మధ్య సయోధ్య ..

Governor vs Pragathibhavan: గవర్నర్‌ వర్సెస్‌ ప్రగతిభవన్‌ కొత్త పంచాయితీ

హైదరాబాద్: రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan Pragati Bhavan) మద్య పంచాయతీ ముగిసిందని అందరూ అనుకున్నారు. గవర్నర్​ తమిళి సై (Governor Tamilisai​), సీఎం కేసీఆర్​ మధ్య సయోధ్య కుదిరిందని భావించినా తాజా పరిణామాలతో విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈసారి గవర్నర్​ వర్సెస్‌ ప్రగతిభవన్‌ మధ్య కొత్త లొల్లి మొదలైంది. మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) ఆరోపణలపై రాజ్‌భవన్‌ స్పందించింది. సచివాలయం ప్రారంభోత్సవానికి ఈర్ష్యతోనే గవర్నర్‌ రాలేదంటూ జగదీష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జగదీష్‌రెడ్డి విమర్శలకు గవర్నర్‌ తమిళిసై సమాధానమిచ్చారు. కొత్త సచివాలయం (New Secretariat) ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. గవర్నర్‌కు ఆహ్వానం పంపించారనేది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ‘‘మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆహ్వానం రాకపోవడం వల్లే గవర్నర్‌ హాజరుకాలేదు’’ అని రాజ్‌భవన్‌ కార్యాలయం నోట్‌ రిలీజ్‌ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికార పక్ష ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యారు. గవర్నర్‌ తమిళిసై, ప్రతిపక్ష నేతలు మాత్రం హాజరు కాలేదు. సచివాలయ ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించింది. ఎమ్మెల్యేలకు ఆయా జిల్లాల అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆహ్వానాలను పంపించారు. అలాగే ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించారు. కానీ, గవర్నర్‌తో పాటు ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా గైర్హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందినా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు హాజరవడం ఆనవాయితీ.

సచివాలయ నిర్మాణ విషయంలో మొదటి నుంచి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాత సచివాలయం బాగానే ఉందని, దాన్ని కూల్చవద్దని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి. ఇంత భారీగా ఖర్చు చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని విమర్శించాయి. సచివాలయ భవన నిర్మాణ నిధులతో రాష్ట్రంలో నూతనంగా ఆస్పత్రులను నిర్మించాలని ప్రతిపక్షాలు సూచించాయి. కానీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విపక్షాలు కొత్త సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక గవర్నర్‌ తమిళిసైతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవు. గత కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను గవర్నర్‌ వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపైనా గవర్నర్‌, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ గైర్హాజరయ్యారు.

Updated Date - 2023-05-02T15:06:44+05:30 IST