Governor vs Pragathibhavan: ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి

ABN , First Publish Date - 2023-05-03T18:16:35+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌..

Governor vs Pragathibhavan: ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan)ను ఆహ్వానించకపోవడం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని రాజ్‌భవన్‌ (Raj Bhavan) వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై గవర్నర్, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ (protocol) పాటించలేదని తప్పుబట్టారు. తాను తెలంగాణ (Telangana)కు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.

ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఏప్రిల్‌ 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Chief Minister KCR) ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు గవర్నర్‌ను, ప్రతిపక్షాల నేతలను, పాత్రికేయులను ఆహ్వానించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమమైనా సర్కారు ప్రొటోకాల్‌ పాటించలేదు. రాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కొన్ని మీడియా సంస్థలపైనా ఆంక్షలు విధించింది. ప్రతిపక్షాల నేతలకూ ప్రభుత్వం సరైన విధానంలో ఆహ్వానం పంపలేదు. ఇంటి గోడకు లేదా తలుపులకు కోర్టు నోటీసులు అంటించినట్లు.. ప్రతిపక్షాల నేతల ఇళ్ల ముందు ఆహ్వాన పత్రాలను పడేసి వెళ్లారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన గవర్నర్‌కు కూడా ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపలేదు. ఈ విషయాన్ని గవర్నరే మంగళవారం స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సచివాలయ నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు

సచివాలయ నిర్మాణ విషయంలో మొదటి నుంచి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాత సచివాలయం బాగానే ఉందని, దాన్ని కూల్చవద్దని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి. ఇంత భారీగా ఖర్చు చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని విమర్శించాయి. సచివాలయ భవన నిర్మాణ నిధులతో రాష్ట్రంలో నూతనంగా ఆస్పత్రులను నిర్మించాలని ప్రతిపక్షాలు సూచించాయి. కానీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విపక్షాలు కొత్త సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక గవర్నర్‌ తమిళిసైతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవు. గత కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను గవర్నర్‌ వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపైనా గవర్నర్‌, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ గైర్హాజరయ్యారు.

Updated Date - 2023-05-03T18:16:35+05:30 IST