ఉస్మానియాలో అధ్వాన స్థితి

ABN , First Publish Date - 2023-07-04T03:25:12+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. దవాఖానాలో ఒకే పడకపై ముగ్గురు పిల్లలకు చికిత్స అందించే

ఉస్మానియాలో అధ్వాన స్థితి
ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలిస్తున్న గవర్నర్‌ తమిళి సై

  • ఒకే బెడ్‌పై ముగ్గురు పిల్లలకు చికిత్స.. రోగులతో కిక్కిరిసిపోయిన దవాఖానా

  • గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. దవాఖానాలో ఒకే పడకపై ముగ్గురు పిల్లలకు చికిత్స అందించే దృశ్యాలు కనిపించడం బాధాకరమన్నారు. ఇక్కడ కనీసం 34 వేల పడకలు ఉండాలని, మూడు భవనాల్లో ఉండాల్సిన రోగులను ఒక్క భవనంలో ఉంచుతున్నారని చెప్పారు. ఒక్కో బెడ్‌ మీద ఇద్దరు ముగ్గురిని ఉంచి సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. సోమవారం తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఇటీవల ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించే అంశంపై ఆమె ట్వీట్‌ చేశారు. దానిపై మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగానే స్పందించారు. ఈ నేపథ్యంలో ఆమె అకస్మాత్తుగా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో మంత్రి హరీశ్‌రావు ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై ప్రజా ప్రతినిధులు, ఆస్పత్రి ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోలు ఇతర అధికారులు ఆ సమావేశానికి వెళ్లిపోయారు. గవర్నర్‌ వచ్చిన సమయంలో ఉన్నతాధికారులెవరూ లేరు. ఈ క్రమంలో ఆస్పత్రి అంతా కలియ తిరిగిన తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. రోగులతో ఆస్పత్రి కిక్కిరిసిపోయిందని, వారి సహాయకులు ఉండేందుకు స్థలం లేదన్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లకు సరిగా తలుపులు కూడా లేవని చెప్పారు. ఇక్కడున్న 7.5 ఎకరాల్లో బహుళ అంతస్థులతో నూతన ఆస్పత్రిని నిర్మించవచ్చని తెలిపారు. 2019లో తాను గవర్నర్‌ అయ్యాక ఉస్మానియా వైద్యులు వచ్చి కలిశారని.. ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని అనేకసార్లు ప్రభుత్వానికి చెప్పామన్నారు. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా.. వైద్యులు, సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారని గవర్నర్‌ అభినందించారు.

Updated Date - 2023-07-04T03:25:12+05:30 IST