కడసారి చూసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:09 AM
కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని బంధువులతో కలిసి అర్ధరాత్రి వాహనంలో హడాహుడిగా బయలుదేరిన కుటుంబాన్ని మరో ప్రమాదం బలి తీసుకుంది.
మిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 25: కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని బంధువులతో కలిసి అర్ధరాత్రి వాహనంలో హడాహుడిగా బయలుదేరిన కుటుంబాన్ని మరో ప్రమాదం బలి తీసుకుంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దుర్ఘటన గిరిజన కుటుంబాల్లో విషాదం నింపింది. బంధువుల రోదనలు, వేదనలతో మిర్యాలగూడ ఆస్పత్రి ప్రాంగణంలో హాహాకారాలు మిన్నం టాయి. ఆప్తులను కోల్పోయిన వారి ఆర్తనాదాలను ఓదార్చే ధైర్యం కూడా చాల్లేదు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. డిగ్రీ చదువుతూ ప్లవర్‌డెకరేషన్ పనులకు వెళ్తున్న రమావత్ శివ(19) ఆదివారం గుం టూరు జిల్లాలో ఫంక్షన్‌కు ప్లవర్‌డెకరేషన్ చేసి తిరిగి మల్లెవాని కుంటతండాకు బైక్‌పై వెళ్తూ రాత్రి 10గంటల సమయంలో నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బడ్డీకొట్టు వ్యాపారీ బూరుగు సైదులు(60)ను ఢీకొట్టి బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయాడు. సంఘటనా స్థలంలోనే సైదులు మృతిచెందగా, శివకు తీవ్రగాయాల య్యాయి. శివను అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తర లించగా చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు.
శివ మరణవార్తతో బయలుదేరి..
అంబులెన్స్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో శివ తండ్రి రమావత్ ప్రభాకర్, తల్లి నాగమ్మ, పెద్దనాన్న రమావత్ ఘన్యా, మేనత్త బుజ్జి బుజ్జి భర్త పాలక్ నాయక్, దూరపు బంధువు రమావత్ పాండు కుటుంబీకులు హైదరాబాద్‌లో తమకు పరిచయమైన ఐరన్, స్టీల్ వ్యాపారి మధుకు చెందిన టాటాఏస్ వాహనాన్ని తీసుకుని రాత్రి 11గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అర్ధరాత్రి 1:30 నిమిషాలకు పెద్దవూర మండలం చలకుర్తి గ్రామపంచాయితీ మల్లెవాని కుంటకు చేరి అక్కడ పిల్లలను వదిలి ఏడుగురు తిరిగి అదే వాహనంలో మిర్యాల గూడకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున నిడమనూరు మండలం పార్వతీపురం స్టేజీ వద్ద దారికాచిన మృత్యువు ట్యాంకర్ రూపంలో ఎదురైంది. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని గమనించక పోవడంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో టాటాఏఎస్ వాహనంనలో ఉన్న రమావత్ ఘన్యా(40), దూపావత్ నాగరాజు(27), డ్రైవర్ రమావత్ పాండు(42), రమావత్ బుజ్జీ(38)లు అక్కడికక్కడే మృతిచెందారు. శివ తండ్రి రమావత్ ప్రభాకర్, తమ్ముడు రమావత్ వినోద్(శివ పెద్దనాన్న ఘన్యా కుమారుడు), మూడావత్ పాలక్‌నాయక్‌కు తీవ్రంగా గాయలయ్యాయి.
హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం
సెంటు భూమిలేక మూడావత్ బుజ్జి, పాలికాలు హైదరాబాద్‌లో కూలి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే పాలికా ఆటో నడుపుతుం డగా, బుజ్జి రెస్టారెంట్‌లో పనికి కుదిరింది. మేనల్లుడు శివ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని భర్తతో పాటు మిర్యాలగూడకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరింది. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో బుజ్జి మృతిచెందగా, భర్త పాలికాకు తీవ్రగాయాలయ్యాయి. వారి ఇద్దరు కుమార్తెలు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది : ఎమ్మెల్మే బత్తుల
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుం బాలను ప్రభుత్వం ఆదుకుం టుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న ఆరుగురి మృతదేహాలను సందర్శించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందడం దరదృష్టకరమన్నారు. ఆయన వెంట గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు స్కైలాబ్‌నాయక్, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీనాయక్ ఉన్నారు.
మల్లెవానికుంట, పూల్యాతండా గ్రామాల్లో విషాదఛాయలు
పెద్దవూర, డిసెంబరు 25: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ, పార్వతీపురం స్టేజీల వద్ద జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మండలంలోని మల్లెవానికుంటకు చెందిన రమావత్ కేశవులు(శివ), గన్యానాయక్, పూల్యాతండాకు చెందిన ముడావత్ బుజ్జి, రమావత్ పాండునాయక్‌లు మృతిచెందడంతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లెవానికుంటకు చెందిన ప్రభాకర్ కుటుంబంలో జరిగిన ఈ విషాద పరిస్థితి పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం తండాలకు చేరుకున్న మృతదేహాలకు బంధుమిత్రుల, కుటుంబసభ్యులు సమక్షంలో మృతదేహాలకు అంత్యక్రియలు ముగించారు. మృతుల కుటుంబాలను మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, ట్రైకార్ మాజీ ఛైర్మన్ ఇస్లావత్ రామచంద్రునాయక్, కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి చేరుకొని నివాళులర్పించారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరుపున బాసటగా నిలిచేందుకు కృషిచేస్తామని తెలిపారు. కాగా అదే ప్రమాదంలో మృతిచెందిన నాగరాజు మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోర్నాల సమీపంలోని సట్టుతండాకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రునాయక్ కోరారు.
అంతులేని వేదన..
నిడమనూరు, డిసెంబరు 25:నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నీమానాయక్ తండా శివారు మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ ప్రభాకర్, నాగమణిల కుమారుడు కేశవులు అలియాస్ శివ ఇంటర్ చదివి డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. డీజే పనినిమిత్తం కొద్దిరోజులుగా గుంటూరులో ఉన్నాడు. అతడి స్వగ్రామం మల్లెవానికుంటాతండాలో సోమవారం బంధువుల ఇరుముడి కార్యక్రమానికి ఆదివారంరాత్రి గుంటూరు నుంచి బైక్‌పై బయల్దేరాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో నిడమనూరు మండలం వేంపాడ్ స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న అదేగ్రామానికి చెందిన బలుగూరి సైదులు(57)ను ఢీకొట్టడంతో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. శివ తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ అతను కూడా మృతిచెందాడు. శివ పెదనాన్న గన్యాతో పాటు బంధువులు హైద్రాబాద్‌లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన శివ బావ నాగరాజు ఖాళీగా ఉండడంతో హైదరాబాద్‌లో అతడికి ఏదైనా ఉపాధి కల్పిద్దామని హైదరాబాద్‌కు వెళ్లారు. హైద్రాబాద్‌లో ఉండగానే వీరికి శివ మృతి చెందిన విషయం తెలిసింది. వెంటనే పర్వేదుల గ్రామానికి చెందిన దండ మధు వాహనాన్ని తీసుకుని అందులో శివ కుటుంబసభ్యులు తండ్రి ప్రభాకర్, పెదనాన్న గన్యా, మేనత్త బుజ్జి, బావ నాగరాజు, మేనమామ పాలక్‌నాయక్, వరుసకు తమ్ముడు వినోద్‌తో పాటు మరో బంధువు పాండునాయక్ మొత్తం ఏడుగురు కలిసి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి బయల్దేరారు. అరగంటలో మిర్యాలగూ డకు చేరేలోపు తెల్లవారుజామున 3.45గంటలకు దట్టంగా ఉన్న పొగమంచులో అతివేగంగా ఎదురుగా లారీ రూపంలో మృత్యువు అందులో నలుగురి ప్రాణాలను కబలించింది. నిడమనూరు మండలం వేంపాడ్ శివారు సాయిబాబా విగ్ర హం సమీపంలో దట్టమైన పొగమంచు కారణంగా దారి కనబడకపోవడంతో వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అందులో ఉన్న రమావత్ గన్యా(40), మూడావత్ బుజ్జి(38), దూపావత్ నాగరాజు(28), రమావత్ పాండు(29) అక్కడికక్కడే మృతిచెందారు. గన్యా, నాగరాజు మల్లెవానికుంట తం డాకు చెందినవారు కాగా, బుజ్జి, డ్రైవరు పాండునాయక్ పుల్యాతండాకు చెందినవారు. ప్రమాదంలో శివ తండ్రి ప్రభాకర్, మృతురాలు బుజ్జి భర్త పాలక్‌నాయక్, మృతుడు గన్యా కుమారుడు వినోద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే మండలంలోనే సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన ఇంజం నర్సిరెడ్డి(56) మృతిచెందాడు. మోపెడ్‌పై నారమ్మగూడెం నుంచి నీలాయిగూడెం వస్తుండగా ముకుందాపురం సమీపంలో లారీని ఢీకొనడంతో మృతి చెందాడు.