ఆ డబ్బు తిరిగి ఇచ్చేయండి!
ABN , First Publish Date - 2023-12-02T03:36:41+05:30 IST
అభ్యర్థులు డబ్బులు పంచితే తీసుకొని ఓటేయడం కామనే! మరి..
పోలింగ్‌లో పాల్గొనని ఓటర్ల ఇళ్లకు వెళ్లి
మరీ అడుగుతున్న పార్టీల కార్యకర్తలు
జవాబు చెప్పలేక తిరిగిచ్చేస్తున్న వైనం
ఊరెళ్లామని చెబుతున్న కొందరు
పర్లేదు.. యూపీఐతో చెల్లించండని పట్టు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అభ్యర్థులు డబ్బులు పంచితే తీసుకొని ఓటేయడం కామనే! మరి.. తీసుకున్న వారిలో కొందరు అసలు బూత్‌కే రాకపోతే? తమ ఓటు హక్కునే వినియోగించుకోకపోతే? ఇలాంటివారి విషయంలోనే అభ్యర్థులు ఆరా తీసి.. డబ్బులు తిరిగి వసూలు చేయిస్తున్నారు. డబ్బులిచ్చిన బూత్ కమిటీ సభ్యులే సదరు ఓటర్ల ఇళ్లకు వెళ్లి పట్టుబట్టి
వసూలు చేస్తున్నారు. ఓటింగ్‌లో పాల్గొననప్పుడు డబ్బులెందుకు తీసుకున్నారు? అని ప్రశ్నిస్తుండటంతో సమాధానం చెప్పలేక తీసుకున్న డబ్బును తిరిగిచ్చేస్తున్నారు. ప్రధానంగా డబ్బులు పంపిణీ చేసిన ప్రాంతాల్లోనే ఆయా బూత్ కమిటీ సభ్యులు చాలెంజ్‌గా తీసుకొని మరీ తిరిగి వసూళ్లు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. డబ్బులు పంచిన జాబితా పెద్దగా ఉండటం, ఆ మేరకు ఓటింగ్ శాతం నమోదు కాకపోవడంతో అభ్యర్థులకు డౌటొచ్చి ఆరాతీయిస్తే పైసలు తీసుకున్నవారిలో చాలామంది అసలు పోలింగ్ బూత్‌కే రానట్టు తెలిసింది. పోలింగ్ నేపథ్యంలో నగరంలోని పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి విందులు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఒక్కో ప్రాంతంలో రూ.500 నుంచి రూ.2వేల వరకు వివిధ పార్టీల అభ్యర్థులు పంపిణీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంపగుత్తగా అపార్ట్‌మెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలకు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు చెల్లింపులు చేశారు. కానీ నగరంలోని పలు నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ శాతం గతంలో కంటే తక్కువ నమోదైంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కూడా గతంలో పోలైన ఓట్లలో కనీసం 70-80శాతం వరకు డబ్బులు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా గతంలో పోలింగ్ అధికంగా నమోదైన బూత్‌లను పరిగణనలోకి తీసుకొని అక్కడి పార్టీల నేతలకు డబ్బులు అందజేశారు. బస్తీలు, కాలనీలు కలిగిన బూత్‌ల్లోనే ఎక్కువ పోలింగ్ జరగ్గా, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు కలిగిన ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది. అయా ప్రాంతాలకు పార్టీల బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నవారికి అభ్యర్థుల నుంచి డబ్బులు వచ్చాయి. పార్టీల బూత్ కమిటీ నేతలు కాలనీలకు వెళ్లి పంపిణీ చేశారు.
పోలింగ్‌లో పాల్గొనని వారికి హుకుం
నగరంలోని పలు నియోజకవర్గాల వారీగా పోలింగ్ తగ్గింది. అయితే బూత్‌ల వారీగా డబ్బులు పంపిణీ చేసిన తర్వాత కూడా కనీసం పోలింగ్ జరగలేదని పలు నియోజకవర్గాల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆరా తీశారు. అసలు ఓటర్లకు డబ్బులిచ్చారా? లేదా? అని అభ్యర్థులు కూడా ప్రశ్నించిన్నట్లు తెలిసింది. దీంతో ఆయా బూత్‌ల్లో ఇన్‌చార్జిగా ఉన్న నేతలు, బూత్ కమిటీ సభ్యులు సైతం తాము డబ్బులిచ్చామని, అయినా కానీ ఓటింగ్‌లో పాల్గొనలేదని అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చిన్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో 20 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆయా అపార్ట్‌మెంట్‌లో ఓటుకు రూ.2వేల చొప్పున ఓ ప్రధాన పార్టీకి బూత్ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ఆ సందర్భంలో డబ్బులిచ్చిన్నట్లుగా తమ దగ్గర ఉన్న ఓటర్ లిస్టులో మార్క్ చేసుకున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం తమ బూత్‌లో ఉన్న ఓట్లలో కనీసం 40శాతం వరకు కాలేదు. దాంతో అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బులు పంపిణీ చేసిన ఓటరు జాబితాను తిరగేస్తే తీసుకున్న వారిలో వందకు పైగా ఓటెయ్యడానికి రాలేదని లెక్కతేలింది. ఈ విషయాన్ని ప్రధాన పార్టీ అభ్యర్థి దృష్టికి తీసుకెళ్ళిన్నట్లు తెలిసింది. హిమాయత్‌నగర్‌లో గల అపార్ట్‌మెంట్‌లో 20కుటుంబాలకు డబ్బులిస్తే అందులో నాలుగు కుటుంబాలే ఓట్లేశాయి. మిగతా కుటుంబాల వారిని చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలని బూత్ కమిటీ సభ్యులు అడిగారు. ‘ఓటెయ్యడానికే రాలేదు. తాము పోలింగ్ బూత్‌లోనే కూర్చొని ఎదురుచూశాం. మేమిచ్చిన డబ్బులివ్వండి.’ అని, అడుగుతున్నారు. డబ్బులు పంపిణీ చేసిన సందర్భంలో సంబంధిత ఓటర్ల ఫోన్ నంబర్లు సైతం ఓటర్ లిస్టులో రాసుకున్న నేపథ్యంలో ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కొందరూ తాము అత్యవసరంగా ఊరు వెళ్ళామని సమాధానాలు వచ్చాయి. దాంతో తాము ఇచ్చిన డబ్బులను తిరిగిచ్చేయాలని, అవకాశముంటే ఫోన్ పే, గూగుల్ పే చేయాలంటూ అడుగడం గమనార్హం. కొందరూ బూత్ కమిటీ సభ్యులు డబ్బులు తీసుకొని ఓటెయ్యని వారి ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు వెళ్ళి అడుగుతున్నారు. దీంతో చేసేదిలేక తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తున్నారు. కొందరూ రాగానే ఇస్తామని అంటుండగా, మరికొందరితో ఫోన్‌పే, గూగుల్ పే చేయించుకుంటున్నారు. పోలింగ్ మరుసటి రోజే ఓటెయ్యని వారి వివరాలు తీసి డబ్బులు అడుగడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.