Share News

irrigation water projects : సాగు నీటి ప్రాజెక్టులపై లెక్కలు ఇవ్వండి

ABN , Publish Date - Dec 22 , 2023 | 02:32 AM

సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 irrigation water projects : సాగు నీటి ప్రాజెక్టులపై లెక్కలు ఇవ్వండి

ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలివ్వండి

నిజాలను ప్రజలకు తెలియకుండా ఉంచొద్దు

ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి

సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర లెక్కలతో పూర్తి స్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి గురువారం తన నివాసంలో అధికారులతో రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. 1956 నుంచి 2014 దాకా, మళ్లీ 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలపై సీఎం ఆరా తీశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతీ అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నామన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి, నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో సీఎస్‌ శాంతి కుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 02:32 AM