ఆటలు.. ఆహ్లాదం.. ప్రమాదం
ABN , First Publish Date - 2023-04-29T23:48:23+05:30 IST
వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారుల సంతోషానికి హద్దుండదు. స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగు తీస్తుంటారు. గల్లీ, లేదం టే గ్రౌండ్‌లో ఆట మొదలు పెట్టారంటే అన్నమే గుర్తుకురాదు, సమయమూ తెలియదు. ఇది ఒక్కప్పటి మాట. మారిన కాలం, సాంకేతికతలో వచ్చిన మార్పు చిన్నారులను ఆటలవైపు కాకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్‌వైపు పురమాయిస్తున్నాయి. దీంతో చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం తగ్గుతోందని వైద్యులు చెబుతున్నా రు.
వేసవి సెలవుల్లో ఆటలవైపు చిన్నారుల మొగ్గు
ఆటలతోనే చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం
గంటకు మించే ఆడితే ప్రమాదమంటున్న నిపుణులు
ఉదయం, సాయంత్ర వేళల్లోనే ఆడాలని వైద్యుల సూచన
కోదాడ : వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారుల సంతోషానికి హద్దుండదు. స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగు తీస్తుంటారు. గల్లీ, లేదం టే గ్రౌండ్‌లో ఆట మొదలు పెట్టారంటే అన్నమే గుర్తుకురాదు, సమయమూ తెలియదు. ఇది ఒక్కప్పటి మాట. మారిన కాలం, సాంకేతికతలో వచ్చిన మార్పు చిన్నారులను ఆటలవైపు కాకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్‌వైపు పురమాయిస్తున్నాయి. దీంతో చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో చిన్నారులను వేసవిలో ఆటలవైపు మళ్లించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. షోకేసు లో పెట్టే ఇండోర్ మొక్కల్లా కాకుండా, ఔట్‌డోర్ మొక్క ల్లా పిల్లలను పెంచాలని, అప్పుడే శరీరానికి తగిన ఆక్సిజన్ లభించి మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుంద ని చెబుతున్నారు. అలా అని వారి మానాన వారిని వదిలేయకుండా ప్రతీ కదలికను గమనిస్తూ ఆటలు ఆడేలా చూస్తే చదువులో చురుకుగా రాణిస్తారు.
నిన్నటి దాకా చదువులతో కుస్తీ పట్టిన చిన్నారులకు వేసవి సెలవుల్లో ఆటలపై మక్కువ కలిగేలా చేస్తే వారిలోని సృజనాత్మకత మెరుగుపడుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అదే విధంగా చిన్నారులు ఏ ఆట అయినా 45నిమిషాల నుంచి గంటలోపు ఆడితేనే ఆరోగ్యమ ని,మారిన ఆహారపు అలవాట్లతో అంతకు మించితే కూడా ప్రమాదమని పేర్కొంటున్నారు.సంప్రదాయ ఆటలను పిల్లలకు పరిచయం చేయాలని చెబుతున్నారు. ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు హ్యాండ్ కర్చిఫ్, కుంటుడు ఆట,మ్యూజికల్ చైర్, నడుముమీద చేయిపెట్టి దుమికే ఆట, స్కిప్పింగ్ ఆడితే వ్యాయామంతోపాటు ఉత్సాహం కలుగుతు ంది.తొమ్మిది, పది, ఇంటర్‌విద్యార్థులు క్రికెట్,చదరంగం, గోటీ లు, జిల్లగోనె, ఖోఖో, వాలీబాల్ ఆడితే మంచిదంటున్నారు.
అథ్లెటిక్స్
అథ్లెటిక్స్ పోటీలు పరుగు, దుమకడం, విసరడం, నడవ టం వంటి క్రీడా సమూహం. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు ఈ ఆటలు ఆడవచ్చు. ఈ ఆటలో వాకింగ్, పరుగుతో చక్కని శరీర ఆకృతి ఏర్పడుతుంది.
ఖోఖో
ఖోఖోతోశరీరం మొత్తం కదులుతుంది. ఈఆటలో భాగం గా పరుగెత్తడం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.అంతేగాక ఆటలో క్రీడాకారుల సంఖ్య ఎక్కువ ఉండ టంవల్ల, ఇతరులు వేసే ప్రతీ అడుగును పసిగట్టే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లల్లో సునిశిత దృష్టి మెరుగవుతుంది.
కబడ్డీ
కబడ్డీతో శరీర దృఢత్వం పెరుగుతుం ది. వేగంగా ఆడే ఆటకావడంతో రక్తప్రసరణ వృద్ధి చెందుతుంది. ఎముకలు బలపడతాయి. తక్కువ పాయింట్లు పోటీ పెట్టుకొని ఆడితే ఆలసట కూడా ఉండదు.
వాలీబాల్
వాలీబాల్ కాళ్లు, చేతి కండరాలకు పని చేప్పే ఆట కావడంతో చక్కని వ్యాయం అవుతుంది.
చదరంగం
చదరంగం విద్యార్థుల్లో మేధో శక్తిని పెంపొందిస్తుంది. సమయసూర్తి, ఆలోచనాశక్తి మెరుగుపడటంతోపాటు సమస్యను సొంతంగా పరిష్కరించుకునే గుణం అలవరుతుంది.
తొక్కుడుబిళ్ల
గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఆట తొక్కుడుబిళ్ల. నాలుగు నిలువుగళ్లు, రెండు ఆడ్డగళ్లు గీచి, బిళ్లను దీర్ఘచతురస్ర గడుల్లో వేసి ఒక కాలు మడిచి ఏనిమిది గడుల నుంచి బిళ్లను బయటకు తీసుకొచ్చే ఆట. ఇది. ఈ ఆటతో ఆడపిల్లల్లో చురుకుదనం ఏర్పడుతుంది.
క్రికెట్
ప్రస్తుతం విద్యార్థులు అత్యధికంగా ఇష్టపడే ఆట క్రికెట్. క్రికెట్‌తో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతోపాటు, చురుకుదనం వస్తుంది. క్రికెట్‌లో పరుగెత్తడం కూడా ఉంటుంది. ఈ ఆటలో శరీరక శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు తక్కువ ఓవర్లతో ఈ ఆట ఆడితే శారీరకంగా మంచి ఫలితం ఉంటుంది.
తల్లిదండ్రులు ఆప్రమత్తంగా ఉండాలి
వేసవిలో తోటి స్నేహితులతో కలిసి ఆటకు వెళ్లే విద్యార్థులపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. ఆటల పేరుతో వెళ్లిన విద్యార్థులు ఈత కొట్టేందుకు చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు. ఈ క్రమంలో చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
పిల్లల్లో పెరుగుతున్న ఉబకాయం
ప్రస్తుతం పిల్లలు సెల్‌ఫోన్, కంప్యూటర్‌కు పరిమితం కావటంతోపాటు, పాస్ట్‌ఫుడ్‌కు అలవాడు పడుతున్నారు. అంతేగాక శారీరక శ్రమ ఉండటం లేదు. ఆటలు లేకపోవడంతో ఒత్తిడి చదువుల కారణంగా మానసిక ఒత్తిడి, ఉబకాయం పెరుగుతోంది. దీంతో చిన్నతనంలోనే గుండెపోటు, షుగర్, బీపీ లాంటి వ్యాధులబారిన పడుతున్నారు.
సంప్రదాయ ఆటలపై తగ్గుతున్న మక్కువ
సంప్రదాయ ఆటలైన గోటీలు, జిల్లగోనె, దాగుడుమూతలు, అష్టాచెమ్మా, పచ్చీస్, తొక్కుడుబిళ్ల, చమ్మచక్క, పిచ్చిబంతి, కోతికొమ్మచ్చి, గుజ్జనగూళ్లు, గుడు గుడుగుం జం, దాడి, నేలబండ, పులిజూదం, రాముడుసీత, వామన గుంతలు లాంటి ఆటలు కనుమరుగవుతున్నాయి. అడపాదడపా మారుమూల పల్లెల్లో తప్ప, పట్టణ ప్రాంతా ల్లో ఈ ఆటలే కన్పించడం లేదు. వేసవిలోనైనా చిన్నారులు గ్రామీణ ఆటలు నేర్చుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. గ్రామీణ క్రీడలతో శారీర ఆరోగ్యంతో పాటు, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడాలి : కొత్తమాసు జనార్ధన్, వైద్యుడు
ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఆటలు ఆడాలి. మండుటెండలో ఆటలు ఆడవద్దు. ఆట ఆడినప్పుడు చెమటలు పట్టగానే మంచినీరు తాగవద్దు. తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అలసట, చెమటలు తగ్గాక నీరు తీసుకోవాలి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల లోపు ఆటలు ఆడితే వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఆ సమయంలో ఆడకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం మారిన ఆహార అలవాట్లతో చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తోంది. ఆటలు ఆడినప్పడు ఏ చిన్న గాయం అయినా వైద్యుడి సంప్రదించాలి. గాయాన్ని పట్టించుకోకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
వేసవిలో పిల్లలు ఆటలు ఆడాలి : శ్రీనివాసరావు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు
వేసవిలో పిల్లలు కచ్చితంగా ఆటలు ఆడాలి. ప్రస్తుతం కార్పొరేట్ చదువుల నేపఽథ్యంలో పాఠశాల సమయంలో వారు ఆటలు ఆడే పరిస్థితి లేదు. కనీసం వేసవి సెలవుల్లోనైనా ఆటలు ఆడాలి. లేదంటే శారీరక, మానసిక పరిపక్వత ఉండదు. గ్రామీణ క్రీడలైన గోటీలు, జిల్లగోనె, దాగుడుమూతలు, అష్టాచెమ్మ, పచ్చీసు, తొక్కుడు బిళ్ల, పిచ్చిబంతి, కోతికొమ్మచ్చి, దాడిఆట, నేలబండ, కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలను తల్లిదండ్రులు ఆడించాలి. ఫలితంగా వారిలో క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. కబడ్డీ లాంటి క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. క్రీడల ప్రాముఖ్యం చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది. సెల్‌ఫోన్‌లో ఆటలు ఆడకుండా, ఔట్‌డోర్ క్రీడల ఆడటంతో చిన్నారుల్లో ఆరోగ్యంతోపాటు, చురుకుదనం పెరుగుతుంది. నెలకొంటుంది.