All the farmers have debts of Rs.40 thousand crores : రుణమాఫీకి నిధులెలా?
ABN , Publish Date - Dec 23 , 2023 | 03:59 AM
రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది.
సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు
అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి రూ.2 లక్షలు
రైతులందరివీ రూ.40 వేల కోట్ల అప్పులు
స్ర్కీనింగ్‌లో రూ.32 వేల కోట్లకు తగ్గే అవకాశం
బ్యాంకుల నుంచి బదలాయించుకుని
వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం
ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు
కటాఫ్ తేదీ ఎప్పటివరకు అనే అంశంపై చర్చ
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ గ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.40 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం, సకాలంలో రూ. లక్ష రుణమాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారిపోయారు. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. కొందరు రైతులు రెన్యువల్ చేసుకున్నా.. ఎక్కువ మంది రెన్యువల్ చేసుకోలేదు. ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా? అని ఎదురుచూశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసినా.. ఆ నిధులతో రుణమాఫీ ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ప్రధానంగా ఉంది. అయితే ఇందుకోసం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది.
ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు..
ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉండగా.. మార్గదర్శకాలు రూపొందించి స్ర్కీనింగ్ చేస్తే ఈ నిధులు మొత్తం సుమారు 20 శాతం వరకు తగ్గే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక కుటుంబంలో భర్త పేరు మీద ఎంత అప్పు ఉంది? భార్య పేరు మీద ఎంత ఉంది? ఎన్ని బ్యాంకుల్లో అప్పులున్నాయి? అర్హులెవరు? అనర్హులెవరు? తదితర అంశాలపై స్ర్కీనింగ్ చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించనున్నారు. అయితే గరిష్ఠంగా కొందరు రైతులు రూ.4 లక్షల వరకు కూడా పంట రుణాలు తీసుకున్నవారున్నారు. వీరికి కూడా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది. రూ.2 లక్షల లోపు అప్పు ఉంటే.. మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా అప్పులను స్ర్కీనింగ్ చేస్తే సుమారు రూ.8 వేల కోట్ల వరకు నిధుల మొత్తం తగ్గుతుందని, రూ.32 వేల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నిధుల సమీకరణకు అన్వేషణ..
రుణమాఫీకి సుమారు రూ.32 వేల కోట్లు అవసరం కానున్న నేపథ్యంలో.. ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. అంటే.. రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకుంటుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. అయితే ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా మారిన నేపథ్యంలో.. నేరుగా రుణం తీసుకునే అవకాశాలు లేవు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి అడ్డు వస్తుండడమే ఇందుకు కారణం. అలాగని సొంత నిధులు సమకూర్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో అప్పులు బదలాయించుకొని వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించడమే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తోంది. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు సిద్ధమైతే బడ్టెట్‌లో భారీ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. 2023-24 బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోవచ్చు. ఒకవేళ మార్గదర్శకాల రూపకల్పనకు సమయం పడితే.. ఈ రెండు, మూడు నెలలు ఆగి కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.
మాఫీకి కటాఫ్ తేదీ ఎప్పటివరకు?
రైతులు తీసుకున్న అప్పులపై అధికారులు లెక్కలు తీస్తుండడంతో.. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారన్న చర్చ మొదలైంది. రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించాలా? లేక కాంగ్రెస్ అధికారం చేపట్టిన తేదీ (ఈ నెల 7)ని కటా్‌ఫగా తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొందరు రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేయగా.. బ్యాంకర్లు అసలు, వడ్డీ కలిపి రెన్యువల్ చేశారు. దీంతో రెన్యువల్ చేసుకున్న రైతులు.. కొత్తగా ఈ ఏడాదిలో అప్పు తీసుకున్నట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ డిసెంబరు 7వ తేదీని కటా్‌ఫగా తీసుకుంటే.. పాత అప్పులు, కొత్త అప్పులు, వడ్డీలు అన్నీ లెక్కలోకి వస్తాయి. పైగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే ఎక్కువ మంది రైతులు, ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందుతారు. ఏకకాలంలో చేస్తే అంతా రుణ విముక్తులవుతారు.