Share News

ఎంపీటీసీ నుంచి శాసనసభ అధిపతి వరకు..

ABN , Publish Date - Dec 14 , 2023 | 03:59 AM

అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కానున్న ప్రసాద్‌ కుమార్‌ స్వగ్రామం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు. దళిత సామాజిక వర్గానికి చెందినవారు.

ఎంపీటీసీ నుంచి శాసనసభ అధిపతి వరకు..

ప్రసాద్‌ కుమార్‌ 21 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

వికారాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కానున్న ప్రసాద్‌ కుమార్‌ స్వగ్రామం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు. దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. ప్రసాద్‌ కుమార్‌కు ఆరుగురు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు ఉండగా... ఆయన ఒక్కరే మగ సంతానం. తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే ఆయనపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. తాండూరులోని విలియం మూన్‌ హైస్కూల్‌లో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం జహీరాబాద్‌ సమీపంలో రంజోల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లోమా పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కళాశాలలో డిగ్రీ చదివారు. ఆ సమయంలో ఎన్‌ఎ్‌సయూఐలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో 1989లో ప్రసాద్‌ కుమార్‌ రాజకీయాల్లోకి వచ్చారు. జిల్లా యువన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ సెల్‌ జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 1994 నుంచి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కొంశెట్‌పల్లి నుంచి ఎంపీటీసీగా విజయం సాధించి... ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రసాద్‌ కుమార్‌ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించారు.

ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడంతో పొత్తులో భాగంగా వికారాబాద్‌ స్థానం టీఆర్‌ఎ్‌సకు దక్కింది. దాంతో ఆ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ విజయం కోసం కృషి చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో చంద్రశేఖర్‌ కూడా రాజీనామా చేశారు. దీంతో 2008 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసాద్‌ కుమార్‌ తన ప్రత్యర్థి చంద్రశేఖర్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2009, ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రసాద్‌ కుమార్‌ మరోసారి చంద్రశేఖర్‌పై గెలుపొందారు. 2012లో కిరణ్‌కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు ఆయన ప్రివిలేజ్‌ కమిటీ, అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్‌ కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ పదవి దక్కబోతోంది. ముఖ్యమంత్రి, స్పీకర్‌ పదవులు రెండూ వికారాబాద్‌ జిల్లాకు దక్కడం విశేషం. దివంగత ఏఐసీసీ నేత జీ వెంకటస్వామితో ప్రసాద్‌ కుమార్‌కు దగ్గర బంధుత్వం ఉంది.

వెంకటస్వామి కుమారులు వినోద్‌, వివేక్‌లు ప్రసాద్‌ కుమార్‌కు బావమరుదులు అవుతారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దామోదర రాజనర్సింహతో కూడా ప్రసాద్‌ కుమార్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. వికారాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని, లేనిపక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తొలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తొలిసారిగా అసెంబ్లీ స్పీకర్‌ పదవి దక్కింది. చంద్రబాబు హయాంలో అప్పటి పరిగి ఎమ్మెల్యే, దివంగత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌ పదవిలో కొనసాగగా, అసెంబ్లీ స్పీకర్‌ పదవి జిల్లాకు దక్కడం ఇదే మొదటిసారి.

Updated Date - Dec 14 , 2023 | 03:59 AM