Share News

TSRTC: మహిళలు ఫ్రీగా జర్నీ చేయాలంటే ఏ కార్డు ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-12-08T03:47:27+05:30 IST

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలైతే.. టీఎస్‌ ఆర్టీసీకి ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

TSRTC: మహిళలు ఫ్రీగా జర్నీ చేయాలంటే ఏ కార్డు ఉండాలంటే..!

  • మహిళలకు ఉచిత ప్రయాణం..

  • ఆర్టీసీపై రూ.3వేల కోట్ల భారం

  • ఉచితాన్ని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రె్‌సకు పరిమితం చేస్తే భారం తగ్గే అవకాశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలైతే.. టీఎస్‌ ఆర్టీసీకి ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ పథకంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. భారం ఎంత అనేదానిపై స్పష్టత చెబుతున్నారు. ఈ నెల 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా, తమిళనాడులో నగరాల్లో, అర్బన్‌ ప్రాంతాల్లో ఈ తరహా పథకం ఇప్పటికే అమల్లో ఉంది. కర్ణాటకలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశమిస్తే.. ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని, అదే పల్లెవెలుగు(ఆర్డినరీ), ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో సరిపెడితే.. రూ.2,500 కోట్ల భారం ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీ ప్రస్తుత ఆక్యుపెన్సీ రేషియోలో మహిళల వాటానే అధికంగా ఉంది. ఆర్టీసీ బస్సులు రోజూ సగటున 40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుండగా.. వారిలో మహిళల వాటా 50-55శాతంగా ఉంటోంది. ఇప్పుడు రోజుకు రూ.15 కోట్ల నుంచి రూ.16 కోట్ల మేర ఆర్టీసీకి చార్జీల రూపంలో ఆదాయం వస్తుండగా.. ఉచిత ప్రయాణ పథకంతో ఆ రెవెన్యూ సగానికి పడిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఆధార్‌ చూపితే చాలు

ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే మహిళలు ఆధార్‌ కార్డును చూపిస్తే సరిపోతుందని అధికారులు వివరించారు. వారికి ‘సున్నా’ చార్జీ టికెట్లు ఇస్తారని.. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం పెద్ద కష్టమైన పని కాదని, ఇప్పటికే ప్రభుత్వం పలు కేటగిరీలకు ఇచ్చే బస్‌పాసుల్లో రూ.వెయ్యి కోట్ల దాకా రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇందుకు అదనంగా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చగలిగితే.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-08T11:22:11+05:30 IST