Share News

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు

ABN , Publish Date - Dec 16 , 2023 | 03:26 AM

ఆ నలుగురు ఎమ్మెల్యేలూ శాసనసభలో తొలిసారి అడుగుపెట్టినవారే.

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు

అడ్లూరి లక్ష్మణకుమార్‌, ఆది శ్రీనివాస్‌,

బీర్ల ఐలయ్య, రాంచంద్రునాయక్‌కు అవకాశం

ఇద్దరు బీసీలు, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకరు

హైదరాబాద్‌, మహబూబాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆ నలుగురు ఎమ్మెల్యేలూ శాసనసభలో తొలిసారి అడుగుపెట్టినవారే. వచ్చీ రావడంతోనే ప్రభుత్వ విప్‌లుగా అవకాశం పొందారు. ధర్మపురి, వేములవాడ, ఆలేరు, డోర్నకల్‌ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, డాక్టర్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌లను విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకంలో సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. ఆది శ్రీనివాస్‌ (మున్నూరు కాపు), బీర్ల ఐలయ్య (కురుమ) బీసీలు కాగా.. లక్ష్మణకుమార్‌ ఎస్సీ మాదిగ, రాంచంద్రునాయక్‌ ఎస్టీ లంబాడా సామాజిక వర్గాలకు చెందినవారు. విప్‌లుగా నియామకం అనంతరం ఈ నలుగురు శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌నూ కలిశారు. కాగా, డాక్టర్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ తాజా ఎన్నికల్లో మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యానాయక్‌ మీద విజయం సాధించారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు సర్పంచ్‌ తండా ఈయన స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ సర్జన్‌ పట్టాలు పొందారు. సూర్యాపేటలో ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి డాక్టర్‌ ప్రమీల గైనకాలజిస్ట్‌. అన్న నెహ్రూనాయక్‌తో కలిసి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లిన సందర్భంలో రాంచంద్రునాయక్‌ను రాజకీయాల్లోకి రావాలంటూ ప్రోత్సహించారు. 2006లో టీడీపీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టారు. 2014లో టీడీపీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రె్‌సలో చేరి 2018లోనూ బరిలో దిగినా పరాజయం పాలయ్యారు.

చీఫ్‌ విప్‌గా వేముల వీరేశం లేదా మల్‌రెడ్డి రంగారెడ్డి?

కాంగ్రెస్‌ ప్రభుత్వలంఓ విప్‌ల నియామకం పూర్తవడంతో చీఫ్‌ విప్‌ ఎవరనేది ఆసక్తి నెలకొంది. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయంలో కీలకమైన ఈ పదవికి నకిరేకల్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగానే నలుగు రు విప్‌లను ఎంపిక చేసిన నేపథ్యంలో.. చీఫ్‌విప్‌నకూ ఇదే అంశం ప్రాతిపదిక కానుందని భావిస్తున్నారు.

Updated Date - Dec 16 , 2023 | 03:29 AM