కులోన్మాద హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:39 AM
ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు.
ఆదిలాబాద్‌లో యువకుడిని చంపేందుకు స్కెచ్
రూ.15 లక్షలకు ఒప్పందం.. ఆరుగురిపై కేసు
హత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణం
మావల, డిసెంబరు 23: ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ శనివారం వెల్లడించారు. ఆదిలాబాద్ మునిసిపల్ పరిధిలోని దుర్గానగర్ కౌన్సిలర్ రఘుపతి కూతురు, అదే కాలనీలో ఎస్సీ కులానికి చెందిన వంశీ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రఘుపతి రెండేళ్ల క్రితమే వంశీని చంపేస్తానని బెదిరించాడు. అయినా వంశీ మారకపోవడంతో ఎలాగైనా అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కేఆర్కే కాలనీకి చెందిన చౌహన్ రవి, అతని మిత్రుడు అశోక్‌తో రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రవికి రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికల తరువాతే హత్య జరగాలన్నాడు. ఆ తర్వాత అశోక్ తన మిత్రుడైన దిల్షాద్‌కు విషయాన్ని చెప్పి ఏదైనా ఒక పాత జీపు కావాలన్నాడు. జీపు ఓనర్ రాజుకు రూ.20 వేలు ఇచ్చారు. దిల్షాద్‌కూ రూ.20 వేలు ఇస్తానని అశోక్ చెప్పాడు. ఈ నెల 18న కొత్తవాడ మలుపు స్కూటర్‌పై వెళ్తున్న వంశీని.. రవి, అశోక్ జీపుతో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. వంశీ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. రవి, అశోక్, దిల్షాద్, రాజులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఏ1 రఘుపతి, ఏ2 అరుంధతి పరారీలో ఉన్నారు.