దళితబంధు ఇప్పిస్తానని..మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మోసం!
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:17 AM
సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. దళితబంధు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన జంగిడగల్ల భూమయ్య అనే వ్యక్తి ఆరోపించారు.
ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నారు
తిరిగి ఇవ్వమంటే అనుచరులతో బెదిరిస్తున్నారు
అందోల్ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
టేక్మాల్, డిసెంబరు 17: సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. దళితబంధు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన జంగిడగల్ల భూమయ్య అనే వ్యక్తి ఆరోపించారు. దళితబంధు రానందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేపై టేక్మాల్ పోలీసులకు భూమయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో.. టేక్మాల్ మండలం పల్వంచ గ్రామానికి చెందిన తనతోసహా నలుగురికి దళితబంఽధు మంజూరైందని, ఆ డబ్బులు రావాలంటే ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున తమకు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆయన సోదరుడు రాహుల్‌కిరణ్ డిమాండ్ చేశారని భూమయ్య తెలిపారు. దీంతో తాము అందోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీ్‌సకు వెళ్లి క్రాంతికిరణ్, రాహుల్‌కిరణ్‌కు చెరో రూ.6 లక్షలు ఇచ్చామని భూమయ్య పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తనకు దళితబంధు ఇప్పిస్తారా.. అని అడిగితే ప్రభుత్వం మారిందని, మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే తీసుకోవాలని క్రాంతికిరణ్ బదులిచ్చారని తెలిపారు. ఇక దళితబంధు రాదని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని క్రాంతికిరణ్‌ను కోరానని, అయితే ఆయన తన అనుచరులతో ఫోన్ చేయించి చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో భూమయ్య వివరించాడు. కాగా, మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందిందని, విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.