Dalitbandhu : అయిదు రెళ్లు విందు..ఇదే దళితబంధు!

ABN , First Publish Date - 2023-09-22T02:30:26+05:30 IST

దళిత బంధు పథకానికి అసలే నిధుల కొరత! ఆపై.. ముంచుకొస్తున్న ఎన్నికలు

Dalitbandhu : అయిదు రెళ్లు విందు..ఇదే దళితబంధు!

యూనిట్‌ ఒక్కటే.. లబ్ధిదారులు ఐదుగురు

రూ.10 లక్షలు ఐదుగురికి పంపకం

‘దళితబంధు’ పథకంలో పొత్తుల కుంపటి.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎత్తులు

ఇన్‌చార్జులను పెట్టి ఒప్పిస్తున్న వైనం.. పెద్దమనుషులతో తీర్మానాలు.. ఒప్పందాలు

‘‘రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు అందరికీ ఇచ్చినా ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ.1.7 లక్షల కోట్లు. సంవత్సరానికి రూ.30 వేల కోట్లో.. రూ.40 వేల కోట్లో ఖర్చువెట్టుకుంట పోతే మూడు, నాలుగేండ్లల్ల మన దళితవాడలన్నీ బంగారు మేడలైతయి. నీకొస్తదా? నాకొస్తదా? అని ఎవ్వరికీ అనుమానాలు వద్దు. ప్రతి కుటుంబానికీ వస్తది’’

..దాదాపు రెండేళ్ల క్రితం హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్‌ ఆ నియోజకవర్గంలో దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పిన మాటలివి! కానీ.. దళిత బంధు కింద ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసే యూనిట్లను (కారు/ట్రాక్టర్‌/హోల్‌సేల్‌ దుకాణాలు) అమ్మేసి, ఆ డబ్బును నలుగురైదుగురికి పంచి, ఎక్కువ మంది ఓట్లను పొందే సరికొత్త దందాకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు తెరతీశారు.

(వరంగల్‌-ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకానికి అసలే నిధుల కొరత! ఆపై.. ముంచుకొస్తున్న ఎన్నికలు!! ఈ నేపథ్యంలో ఈ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక కొత్త వ్యవహారానికి తెరతీశారు. అదే.. ‘‘ఒక యూనిట్‌-ఐదుగురు లబ్ధిదారులు’’. ఈ పథకం కింద దరఖాస్తుదారులకు మంజూరయ్యే ఒక్కో యూనిట్‌ను ముగ్గురి నుంచి ఐదుగురి దాకా పంచుకునేలా రూపొందించిన వ్యవహారం ఇది. ఉదాహరణకు.. ఒక దరఖాస్తుదారుడికి ఈ పథకం కింద రూ.10 లక్షల విలువ చేసే కారు మంజూరైతే దాన్ని ఏ రూ.9 లక్షలకో అమ్మేసి అసలు లబ్ధిదారుతో పాటు మరో నలుగురికి ఆ సొమ్మును పంచుతారన్నమాట. అంటే సగటున ఒక్కొక్కరికీ రూ.1.8 లక్షల దాకా ముడుతుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో నెగ్గాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితం ఆ నియోజకవర్గంలో అమలు చేసిన దళితబంధు పథకాన్ని.. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆ ప్రకారం తొలి విడతలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికీవంద యూనిట్ల చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికీ 1100 యూనిట్లకు పెంచారు. కాగా, తొలి నుంచీ ఈ పథకాన్ని దాదాపుగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారు. నిబంధనలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేకు ఇవ్వాలని అనిపిస్తే మంజూరు చేస్తున్న పరిస్థితి. అయితే, రానున్న ఎన్నికల నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది దళితుల ఓట్లను పొందేందుకు.. ఎక్కువ మంది అసమ్మతి లేకుండా చూసుకోవడానికి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కొత్త ఎత్తు వేశారు. గ్రామాల్లో ఒక్కో యూనిట్‌నూ దాదాపు ఐదుగురికి పంచాలని నిర్ణయించి.. ఎవరెవరికి ఇవ్వాలో ఎంపిక చేసే బాధ్యతను ఇన్‌చార్జులకు అప్పగించారు.ఇలా ప్రతి గ్రామానికీరెండు యూనిట్ల చొప్పున ఎమ్మెల్యేలు కేటాయించగా.. ఆశించే వారి సంఖ్య దాదాపు 20 మంది దాకా ఉంది. దీంతో.. దరఖాస్తు చేసుకున్నవారిలో బీఆర్‌ఎస్‌ పార్టీ అనుకూలురు, కార్యకర్తలు ఎవరో చూసి.. పథకాన్ని ఎవరికి ఇవ్వాలో గ్రామ ఇన్‌చార్జి నిర్ణయిస్తున్నారు.

అనంతరం వారి పూర్తి వివరాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆయా గ్రామాల్లో పరిస్థితి ఏమిటో చెబుతారు. వారిలో పార్టీకి ఎవరి సహకారం ఎక్కువగా ఉంటుందో చూసి.. ఒక్కో యూనిట్‌కూ ముగ్గురు లేదా ఐదుగురిని ఎంపిక చేస్తున్నారు. వారిలో ఒకరిపేరిట దళితబంధు కింద వచ్చిన యూనిట్‌ను అమ్మేసి మిగతావారికి వాటాలు ఇవ్వాలని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవి లిఖిత పూర్వకంగా చేసుకుంటే ఇబ్బందులు వస్తాయనే భయంతో.. ముందుజాగ్రత్తచర్యగా ప్రస్తుతానికి మౌఖిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెద్ద మనుషులతో తీర్మానాలు చేయిస్తున్నారు. యూనిట్‌ను మంజూరు చేసే ఎంపీడీవో దగ్గర లబ్ధిదారు పేరు ఖరారు చేయడం, అనంతరం ఆ యూనిట్‌కు మిగతా నలుగురినీ జోడించడం సదరు పెద్దమనుషుల విధి.

భవిష్యత్తులో ఇబ్బందులు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు.. ..2021 ఆగస్టులో ఆ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో మొత్తం 17 లక్షల కుటుంబాలు ఉన్నాయనుకుంటే.. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికీ సగటున 14285 దళిత కుటుంబాలు ఉన్నట్టు లెక్క. ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికీ 1100 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే 1100 కుటుంబాలకు లబ్ధి. దాన్ని ఐదుగురికి పంచాలన్న ఎమ్మెల్యేల కొత్త ప్రణాళికతో దాదాపు ఒక్కో నియోజకవర్గంలో 5500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్టు. మరి మిగతా ఎనిమిదివేలకు పైగా కుటుంబాల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ వ్యవహారం వల్ల భవిష్యత్తులో ఊళ్లల్లో దళితుల మధ్య చిచ్చు రేగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

అదెలాగంటే.. ఇప్పుడు లబ్ధిదారుగా ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకం అందుకున్నవారికి రికార్డుల ప్రకారం రూ.10 లక్షల యూనిట్‌ వస్తుంది. కానీ, దాన్ని అమ్మి పంచుకోవడం వల్ల వాస్తవంగా వారి చేతికి అందేది రూ.1.8 లక్షలే. కానీ, రికార్డుల ప్రకారం దళిత బంధు దక్కని మిగతా నలుగురికీ భవిష్యత్తులో ప్రభుత్వం ఆ పథకాన్ని వర్తింపజేయొచ్చు. అప్పుడు ఎన్నికలు ఉండవు కాబట్టి.. తమ కు ఆ పథకం కింద దక్కిన సొమ్మును ఇతరులతో పంచుకోవడానికి వారు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడంటే.. ఎమ్మెల్యేలకు ‘ఓటు గండం’ ఉంది కాబట్టి అందరినీ ఒప్పించి డబ్బులు పంచే వ్యవహారానికి తెరతీశారు. ఒకసారి ఓటు పడి గెలిచాక.. ఎమ్మెల్యేలు ఇప్పటిలా ఓపిగ్గా ఈ సమస్యలను పరిష్కరించకపోవచ్చు. దీంతో గ్రామాల్లో దళితుల మధ్య ఈ సమస్య పరిష్కారం కాక.. ఘర్షణలు జరిగే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పొత్తుకు ఓకే అంటేనే..

ఉదాహరణకు.. దళిత బంధు పథకం కింద వరంగల్‌ జిల్లాలో వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలకు 3,300 యూనిట్లను కేటాయించగా, 7,353 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకూ వరంగల్‌ జిల్లాలో 303 యూనిట్లను మాత్రమే మంజూరు చేశారు. ప్రతీ యూనిట్‌ కింద ట్రాక్టర్‌, కారును మంజూరు చేస్తున్నారు. వాటిని అమ్మి ఇతరులతో పంచుకోవడానికి సుముఖంగా ఉన్నవారికే దళితబంధు యూనిట్‌ను కేటాయిస్తున్నట్టు తెలిసింది. నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఈ తరహా ఒప్పందాలు జరుగుతున్నట్టుగా సమాచారం. వరంగల్‌ సిటీలో మాత్రం పొత్తులు లేకుండా సింగిల్‌ లబ్ధిదారునే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. నర్సంపేటలో మొదలైన ఈ పొత్తుల కుంపటి, క్రమంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు పాకినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ఇలాగే పంచుకుని, తీసుకోవాల్సిందిగా పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా కాకుండా ఇలా ఇవ్వడమేంటని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇదేం పద్ధతిగా లేదని, ఇన్ని రోజలు పార్టీ కోసం పనిచేస్తే.. ఇతర వ్యక్తులతో పొత్తు ఎలా పెడ్తారంటూ స్థానిక నాయకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొంతమంది మాత్రం.. ‘‘వచ్చిన కాడికి తీసుకుందాం, మళ్లీ పథకం పోతే వస్తుందో? రాదో?’’ అని భావించి ఎమ్మెల్యేల మాటకు సరే అంటున్నారు.

Updated Date - 2023-09-22T02:30:26+05:30 IST