Share News

Fire in Karachi Bakery Godown : కరాచీ బేకరీ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Dec 15 , 2023 | 03:42 AM

అది హైదరాబాద్‌లోని ప్రముఖ బేకరీకి చెందిన గోదాం.

Fire in Karachi Bakery Godown : కరాచీ బేకరీ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

15 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

వారిలో ఐదుగురి పరిస్థితి విషమం

గగన్‌ పహాడ్‌ పారిశ్రామికవాడలో ఘటన

సీఎం దిగ్ర్భాంతి.. మెరుగైన చికిత్సకు ఆదేశంశంషాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్‌లోని ప్రముఖ బేకరీకి చెందిన గోదాం. అక్కడి కిచెన్‌లో తయారైన తినుబండారాలు నగరంలోని ఆ బేకరీకి చెందిన అన్ని బ్రాంచ్‌లకు సరఫరా అవుతాయి. గురువారం ఆ కిచెన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమయ్యేలోపే అగ్నికీలలు అందరినీ చుట్టుముట్టాయి. దీంతో 15 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గగన్‌ పహాడ్‌ పారిశ్రామికవాడలో గల కరాచీ బేకరీ గోడౌన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలో కరాచీ బేకరీ నిర్వాహకులు కొన్నేళ్ల క్రితం గోడౌన్‌ ఏర్పాటు చేశారు.

అందులోనే కిచెన్‌ నడుపుతూ కేక్‌లు, తినుబండారాలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి జంట నగరాల్లోని బ్రాంచ్‌లు, దుకాణాలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఈ గోడౌన్‌లో యూపీ, రాజస్థాన్‌, బిహార్‌కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. గోడౌన్‌ బయట ఏర్పాటు చేసిన సిలిండర్ల నుంచి పైప్‌లైన్‌ ద్వారా వచ్చే గ్యాస్‌తో పెద్ద పెద్ద బట్టీల్లో వివిధ రకాల స్వీట్లు, తినుబండారాలను తయారు చేస్తుంటారు. గురువారం అనూహ్యంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ పగిలిపోయి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో అందులో పనిచేస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వారు ధరించిన దుస్తులతో పాటు కాళ్లు, చేతులు, ముఖం ఇతర భాగాలు కాలిపోయాయి. వెంటనే మిగతా సిబ్బంది బయటకు పరుగులు తీసి గ్యాస్‌ సరఫరాను నిలిపివేయడంతో మంటలు కొంతమేర తగ్గాయి. అనంతరం నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు 108 అంబులెన్సులను రప్పించి క్షతగాత్రులను శంషాబాద్‌లోని ట్రైడెంట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తీవ్ర గాయాలైన 12 మందిని మెరుగైన చికిత్స కోసం కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి తలించారు. అందులో ఒకరికి 80 శాతం, ఇద్దరికి 60 శాతంపైగా, ఇద్దరికి 50 శాతం కంటే ఎక్కువగా శరీరం కాలిపోయింది. ఈ ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 15 , 2023 | 03:42 AM