నా రాజీనామాపై తప్పుడు వార్తలు
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:26 AM
‘నేను రాజీనామా చేస్తానంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌గా విధులను సంతోషంగా నిర్వర్తిస్తున్నా. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆలోచన లేదు
అధిష్ఠానం ఆదేశిస్తే.. దేనికైనా సిద్ధం
అనురాధ టింబర్ డిపో నైపుణ్యం అద్భుతం
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
బోయిన్‌పల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను రాజీనామా చేస్తానంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌గా విధులను సంతోషంగా నిర్వర్తిస్తున్నా. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు. అలాంటి నిర్ణయాలుంటే.. స్వయంగా నేనే ప్రకటన చేస్తా’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే.. దేనికైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. శనివారం ఆమె బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపోను సందర్శించారు. తమిళిసై రాజీనామా వార్తలపై ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. అయోధ్య రామ మందిరానికి 10 ప్రధాన ద్వారాలతోపాటు.. మొత్తం 118 తలుపులు అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ పనులను పరిశీలించారు. తాజాగా గవర్నర్ తమిళిసై శనివారం ఈ డిపోను సందర్శించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు.20 అడుగుల శ్రీరాముడి శిల్పం, అనంత పద్మనాభుడి శిల్పాలను పరిశీలించారు. అనురాధ టింబర్స్ అధినేతలు చదలవాడ శరత్ బాబు, చదలవాడ కిరణ్‌లను ఆమె అభినదించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అయోధ్య రామమందిరానికి హైదరాబాద్‌లో ద్వారాలు తయారవ్వడం అభినందనీయమని, ఈ అవకాశం అనురాధ టింబర్స్‌కు దక్కడం దేవుడి వరంలాంటిదని అన్నారు. చదలవాడ శరత్‌బాబు మాట్లాడుతూ అయోధ్య ఆలయ ద్వారాలను రూపుదిద్దే అవకాశం రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామన్నారు. కాగా, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1న రాజ్‌భవన్‌లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు దర్బార్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.