గురుకులాల్లో.. నకిలీ అడ్మిషన్ల దందా!
ABN , First Publish Date - 2023-01-05T00:55:37+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ గురుకులాలకు మంచి పేరుంది. గురుకుల విద్యాలయాల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు..
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ గురుకులాలకు మంచి పేరుంది. గురుకుల విద్యాలయాల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు.. నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఇప్పటికే గురుకులాల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత ఉద్యోగాలను సాధించారు. సకల సౌకర్యాలున్న గురుకులాల్లో సీటు వస్తే చాలు.. భవిష్యత్‌లో పిల్లల ఉపాధికి కొదవ ఉండదని తల్లిదండ్రులు భావిస్తారు. దీంతో సర్కారీ గురుకులాల్లో సీటు కోసం బాగా పోటీ పెరిగింది. అంతా బాగానే ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్కడక్క గురుకులాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని బోరబండ బాలుర గురుకుల పాఠశాలలో వెలుగుచూసిన నకిలీ అడ్మిషన్ల ఘటనే ఇందుకు నిదర్శనం. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లోని అచ్చంపేట, పెబ్బేరు, పానగల్, శ్రీరంగాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం కోసం ఆయా ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో చేరారు. శిక్షణతో పాటు.. సీటు కూడా ఇప్పిస్తామని, అందుకు కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పిన కేటుగాళ్లు.. 23 మంది విద్యార్థుల నుంచి రూ.2.50 లక్షలు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలకు పైగానే దండుకున్నారు. నాలుగు నెలల క్రితం బోరబండలోని గురుకులంలో సంస్కృతం బోఽధించేందుకు అతిథి ఉపాధ్యాయుడిగా తాత్కాలిక పద్ధతిన నియామకం అయిన వ్యక్తే నకిలీ అడ్మిషన్ల దందాలో కీలక సూత్రధారి. గురుకులంలో అడ్మిషన్లు పొందిన ఐదో తరగతి విద్యార్థులు కొంతమంది తరచూ గైర్హాజరు కావడం, కొంతమంది వెళ్లిపోవడం, వారి స్థానంలో కొత్త విద్యార్థులు వచ్చి చేరడాన్ని ఆ ఉపాధ్యాయుడు గమనించాడు. అనంతరం శిక్షణ సంస్థలతో ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి వచ్చిన కొంతమంది విద్యార్థులను గురుకులంలోకి తీసుకెళ్లి క్లాసులు చెప్పించేవాడని సమాచారం. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వస్తుండడం గమనార్హం. అప్పుడప్పులో గురుకులాల్లో లోపాలు బయటపడుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
నకిలీని తేల్చిన హాజరు పట్టిక..
బోరబండ గురుకులంలో చేరిన తమ పిల్లలను కొద్దిరోజులు ఇంటికి పంపడంతో అనుమానం వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి హాజరుపట్టికను పరిశీలించారు. అందులో తమ పిల్లల పేర్లు లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో వారు విద్యార్థి సంఘాలను ఆశ్రయించడంతో నకిలీ అడ్మిషన్ల దందా వెలుగులోకి వచ్చింది. సమస్య జటిలమవడంతో డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు 13 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.లక్షన్నర వరకు తిరిగి ఇచ్చారు. మిగతావారికి ఇవ్వాల్సి ఉంది. దందాకు సూత్రధారి అయిన సంస్కృత ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసినప్పటికీ.. ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్ ఏంటంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు అధికారిక ప్రవేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో కేవలం ఐదుగురికి మాత్రమే అడ్మిషన్ ఇవ్వగలుగుతామని ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. దీంతో మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా అతిథి ఉపాధ్యాయుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని నియమించడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏది?
గురుకులాల్లో ఏయే తరగతుల్లో ఎంత మంది విద్యార్థులు చేరుతున్నారు? ఎందరు గైర్హాజరవుతున్నారు? గురుకులాన్ని వదిలి వెళ్లిన వారెంతమంది? తదితర వివరాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందన్న ఆరోపణలొస్తున్నాయి. తమ పాఠశాలలోని విద్యార్థులు ఎవరన్న దానిపై సరైన పరిశీలన లేకపోవడంతోనే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థి సంఘం నేత అశోక్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.