ఆటుపోట్లు ఎదుర్కొని.. సీఎం పీఠంపై
ABN , First Publish Date - 2023-12-05T23:57:36+05:30 IST
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం చేశారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన వెళ్లే దారిలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. అధికార పార్టీ ఆయన ఇంటిపై ఐటీ శాఖతో దాడులు చేయించింది. కేసుల పాల్జేసింది. సొంత పార్టీ నేతలు కూడా రేవంత్‌పై ఎదురు దాడికి దిగారు. అయినా, ఇవేమీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడంపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. ఎదుటి వారికి దడ పుట్టించే వ్యూహాలతో ముందుకెళ్లారు. పదేళ్ల తర్వాత అధికారం హస్తగతం చేసుకోవడంలో కీలకంగా మారారు. ఆయన పోరాట పటిమకు ఇప్పుడు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అందివచ్చింది.
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో
పార్టీని విజయ తీరాలకు తీసుకుపోవడంలో కీలకంగా..
వికారాబాద్ ప్రాంతానికి రెండోసారి దక్కనున్న సీఎం అవకాశం
పదునైన వ్యూహాలతో పార్టీలో ఉత్సాహం నింపిన నేత
పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి ఊపిరి
ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన సంబరాలు
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం చేశారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన వెళ్లే దారిలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. అధికార పార్టీ ఆయన ఇంటిపై ఐటీ శాఖతో దాడులు చేయించింది. కేసుల పాల్జేసింది. సొంత పార్టీ నేతలు కూడా రేవంత్‌పై ఎదురు దాడికి దిగారు. అయినా, ఇవేమీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడంపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. ఎదుటి వారికి దడ పుట్టించే వ్యూహాలతో ముందుకెళ్లారు. పదేళ్ల తర్వాత అధికారం హస్తగతం చేసుకోవడంలో కీలకంగా మారారు. ఆయన పోరాట పటిమకు ఇప్పుడు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అందివచ్చింది.
వికారాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీఎం పదవికి రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంగళవారం ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డితో పార్టీ సీనియర్ నేతలు పలువురు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తక్కువ వయస్సులోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కనుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ వికారాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్, తాండూరు ద్వినియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ఇప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపడుతుండడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కష్టకాలంలో పీసీసీ అధ్యక్షుడిగా ...
ప్రత్యేక రాష్ట్రం సిదిఽ్ధంచిన తరువాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవాలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా నష్టపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్‌రెడ్డిలోని పోరాట పటిమను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగించింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలైనా ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా విజయం సాధించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేవంత్‌రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలు ఆయన ప్రతిష్టను పెంచేలా చేశాయి. కష్టాల్లో ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తే అవసరమని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం రెండున్నరేళ్ల కిందట ఆయనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే తమను కాదని రేవంత్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సీనియర్ నాయకుల్లో వ్యతిరేకత ఎదురైనా ఆయన పట్టించు కోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు దూసుకెళ్లారు. పార్టీలో కొందరు సీనియర్ నాయకుల విమర్శలు, ఎత్తిపొడుపులు ఎదుర్కొంటూనే.. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీని గాడిన పెట్టేందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆయన కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు. ప్రజల్లో వ్యక్తమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకుని పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో రేవంత్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎన్నికలకు ముందు.. ఈ ఎన్నికల్లో తాను గెలిచి, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే కొడంగల్ బిడ్డనైన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందని, తనను దీవించాలంటూ ఆయన కొడంగల్ నియోజకవర్గ ప్రజలను కోరారు. పార్టీలో సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేసిన రేవంత్‌రెడ్డి పడ్డ కష్టాన్ని గుర్తించిన అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అఽధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని ముందుగా ప్రకటించిన ఆయన ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాకారం చేసుకోగలిగారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండడంతో ఆయనకు ఎమ్మెల్యేకు విజయం అందించిన కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం టపాసులు పేల్చారు. స్వీట్లు పంచారు.
మారనున్న జిల్లా రూపురేఖలు ..!
రేవంత్‌రెడ్డి రాష్ట్రముఖ్యమంత్రి అయితే కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని జిల్లా ప్రజలు కొండంత ఆశలో ఉన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్న ఆకాంక్ష వారిలో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దీపం కింద చీకటిలా మారిన వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.