Share News

రాత్రికి రాత్రే భూముల దోపిడీ!

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:08 AM

రాష్ట్రమంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో..

రాత్రికి రాత్రే భూముల దోపిడీ!

రూ.వందల కోట్ల విలువైన భూములకు సంబంధించి

98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే!

ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర?

అర్ధరాత్రి క్లియరెన్స్‌.. ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు!

జిల్లా కలెక్టర్‌ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల

క్లియరెన్స్‌ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది?

కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా?

అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం

ఈ దందాపై మందకొడిగా సాగుతున్న విచారణ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): రాష్ట్రమంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో.. రంగారెడ్డి జిల్లాలో రూ.వందల కోట్ల విలువైన భూములకు సంబంధించి జరిగిన ధరణి అక్రమాల వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయా? దాదాపు నెలరోజుల వ్యవధిలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను ధరణిలో పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా అక్టోబరు 20 రాత్రే.. అంటే ఒక్కరాత్రిలోనే మొత్తం ఫైళ్లను క్లియర్‌ చేశారా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములకు సంబంధించి.. తనకు తెలియకుండానే ధరణిలో ఫైళ్లు క్లియర్‌ చేశారంటూ అప్పటి కలెక్టర్‌ భారతి హొళికేరి నవంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు.. ధరణి కోఆర్డినేటర్‌ను, ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేశారు. కానీ, వందల కోట్ల విలువైన భూములకు సంబంధించిన ఫైళ్లను ఒక్క రాత్రిలో పరిష్కరించడం వెనుక ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉన్నట్లు చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబరు 14 నుంచి నవంబర్‌ 11 మధ్య ఈ అక్రమాలు జరిగాయని.. ఆ సమయంలో 98 ఫైళ్లు క్లియర్‌ కాగా, వాటిలో 20 ఫైళ్లకు మాత్రమే తన ఆమోదం ఉందని.. మిగతా ఫైళ్ల క్లియరెన్స్‌ తనకు తెలియకుండానే జరిగిందని భారతి హొళికేరి ఉన్నతాధికారులకు తెలిపారు.

వాస్తవానికి మొత్తం ఫైళ్ల క్లియరెన్స్‌ అక్టోబర్‌ 20వ తేదీ రాత్రే జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్‌ లాగిన్‌తో మాత్రమే తెరుచుకునే ధరణి పోర్టల్‌లో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఇతరులు ఒక్క రోజు క్లియర్‌ చేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రతి ఫైల్‌ క్లియరెన్స్‌కూ కలెక్టర్‌ వేలిముద్ర తప్పనిసరి. అలాంటిది.. భారతి హొళికేరి చెప్పినట్లు 20 ఫైళ్లు ఆమె పరిష్కరించాయనుకున్నా, మిగతా 78 ఫైళ్లూ ఆమెకు తెలియకుండా ఎలా క్లియర్‌ అవుతాయన్నది వారి ప్రశ్న. సాంకేతికంగా చూసినా.. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన దాఖలాలే లేవు. కలెక్టర్లకు తెలియకుండా ఆపరేటర్లు అక్రమాలు చేయాలనుకున్నా ఏదో ఒకటి, అర మాత్రమే సాఽధ్యమని.. అంతేతప్ప, ఇంత పెద్ద సంఖ్యలో అక్రమాలకు పాల్పడడం అసాధ్యమని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్లు.. విషయం బయటకురావడంతో ఉలిక్కిపడి పాపం మొత్తాన్నీ ఆపరేటర్లపై వేసి చేతులు దులుపుకున్నట్లు.. ప్రచారం సాగుతోంది. ఎన్ని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం ఈ దందాపై ఇప్పటికీ నోరు మెదపట్లేదు. మొత్తం ఆ రోజు క్లియరైన ఫైళ్లకు సంబంధించిన భూములు ఎక్కడవి? వాటి విస్తీర్ణం ఎంత? అనే విషయాలు అసలు బయటకు పొక్కనీయడం లేదు.

ఈ మండలాల్లోనే!

నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, మహేశ్వరం, మాడ్గుల్‌ మండలాల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ఆయా మండలాల్లో రికార్డులన్నీ తారుమారు చేసి.. భూములకు రెక్కలు తొడిగారని సమాచారం. ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో ఉన్న శంషాబాద్‌, మియాపూర్‌, నార్సింగ్‌లలోని ప్రభుత్వ, అసైన్డ్‌, వక్భ్‌బోర్డు భూములకు క్లియరెన్స్‌ ఇచ్చి.. పాస్‌బుక్‌లు జారీ చేసి, మ్యూటేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ధరణిలో క్లియరైన దరఖాస్తులకు సంబంధించిన భూములకు సాధారణంగా మరుసటిరోజు స్లాట్‌ బుక్‌చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం అసాధ్యం. కానీ ఈ దందా వెనుక పెద్దలు ఉండడంతో 12 గంటల్లోపే రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. 20వ తేదీ అర్ధరాత్రి క్లియరైన కొన్ని దరఖాస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు.. మర్నాడు ఉదయం 11గంటలకే పూర్తయిపోయాయి. ఈ వ్యవహారమంతా కొందరు పెద్దల కనుసన్నల్లోనే జరిగిందనడానికి ఇదే నిదర్శనమనే వాదన వినిపిస్తోంది.

విచారణలో జాప్యమేల?

ఈ వ్యవహారంపై ఫిర్యాదు వచ్చి దాదాపు 25 రోజులు గడిచినా.. విచారణ మాత్రం మందకొడిగా సాగడం గమనార్హం. ఈ వ్యవహారంపై నవంబర్‌ 5వ తేదీన పోలీస్‌ స్టేషన్‌కు కలెక్టర్‌ నుంచి ఫిర్యాదు అందింది. అయితే, ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా ఇవ్వాల్సిన ఫిర్యాదును పోస్టు ద్వారా పంపడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు 609/2023 నంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ధరణి కో ఆర్డినేటర్‌ నరేష్‌, ఆపరేటర్‌ మహే్‌షపై ఐపీసీ 167, 409, 419, 420 సెక్షన్లకింద, 66సీ ఐటీఏ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు. కానీ ఇంత వరకూ వీరిని అరెస్ట్‌ చేయలేదు. చార్జ్‌షీటు కూడా దాఖలు చేయలేదు. గత ప్రభుత్వ హయంలో కొందరు పెద్దలు విచారణను అడ్డుకోవడంతో.. నామ్‌కే వాస్తేగా నిందితులను పిలిపించి, ప్రశ్నించి వదిలిసినట్టు సమాచారం.

కలెక్టర్‌ బదిలీకి అదే కారణమా?

కలెక్టర్‌ భారతి హొళికేరి ఆకస్మిక బదిలీకి ధరణీ అక్రమాలే కారణమని తెలుస్తోంది. కేవలం 72 రోజులు మాత్రమే ఇక్కడ పనిచేసిన ఆమెను ఆకస్మాత్తుగా బదిలీ చేసిన ప్రభుత్వం ఇంత వరకూ పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే.. సీఎంతో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు హాజరై తిరిగి వచ్చిన కొద్దినిమిషాల్లోనే ఆమెపై బదిలీ వేటు పడడం గమనార్హం.

Updated Date - Dec 29 , 2023 | 03:08 AM