సీఎల్పీ చాంబర్‌కు ఈటల

ABN , First Publish Date - 2023-02-09T02:13:48+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బుధవారం అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. అక్కడ ఈటల, కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారంటూ మీడియాలో ప్రచారం జరిగింది.

సీఎల్పీ చాంబర్‌కు ఈటల

కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారంటూ ప్రచారం

అల్పాహారం కోసం మాకు అసెంబ్లీలో గది లేదు

టిఫిన్‌ తినేందుకే వెళ్లాను.. ఈటల వివరణ

బీజేపీకి గది కేటాయించాలంటూ డిమాండ్‌

ఐదుగురికిపైగా సభ్యులుంటేనే గది: హరీశ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బుధవారం అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. అక్కడ ఈటల, కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే అంశంపై ఈటల సభలో స్పందించారు. అల్పాహారం తినేందుకు తమకు ప్రత్యేకంగా గది లేదని, టిఫిన్‌ తినేందుకే సీఎల్పీ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. ‘ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్‌ తినేందుకు అసెంబ్లీ ఆవరణలో మాకు అవకాశం లేదు. ఎక్కడ తినాలా? అని ఆలోచిస్తుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, వారి కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అందుకోసమే సీఎల్పీలోకి వెళ్లాల్సి వచ్చింది’ అని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీకి అసెంబ్లీలో ఒక గదిని కేటాయించాలని సభలో డిమాండ్‌ చేశారు. ఈటల మాట్లాడుతుండగానే ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. ఏ పక్షానికైనా ఐదుగురుకు పైగా సభ్యులుంటేనే వారికి శాసనసభలో కార్యాలయం కేటాయించే ఆనవాయితీ ఉందని హరీశ్‌ పేర్కొన్నారు. ఒకవేళ దీనిపై ఇంకా ఏమైనా కావాలనుకుంటే స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. బడ్జెట్‌ మీద చర్చ జరిగే సమయంలో దాని పరిమితికి లోబడే చర్చించాలని, ఆ మేరకు బడ్జెట్‌పై సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. ఇదే అంశంపై సభలో కాసేపు ఈటలకు మంత్రులు హరీశ్‌, తలసాని, వేముల ప్రశాంత్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. గతంలో ఒక్కరే సభ్యులుగా ఉన్న జయప్రకాశ్‌ నారాయణకు, సీపీఐకి కూడా గది కేటాయించారని ఈటల గుర్తు చేశారు. ‘మాకు నాచురల్‌ కాల్‌ వస్తది అప్పుడు బయట ఎక్కడికి వెళ్లాలి?’అని ప్రశ్నించారు. ఈ అంశంపై శాసనసభా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. ‘ఇది బడ్జెట్‌పై చర్చ, వారికేమైనా సౌకర్యాలు కావాలనుకుంటే స్పీకర్‌కు విజ్ఞప్తి చేయాలి. స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. అందుకోసం వాదన ఎందుకు? బడ్జెట్‌ సమయాన్ని ఇందుకోసం ఉపయోగించడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. నాచురల్‌ కాల్‌ వస్తే సభ్యులందరికీ అసెంబ్లీలో సౌకర్యం ఉందన్నారు. సభా సంప్రదాయాలు అంశాన్ని లేవనెత్తడంతో 20ఏళ్ల తర్వాత సభాసంప్రదాయాలు, పద్ధతులు నేర్చుకుంటాం అంటూ ఈటల వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని.. ‘20 ఏళ్ల తర్వాత నేర్చుకునేదీ ఏమీ ఉండదు. ఈ వాదన మొత్తం బయటకు వెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప వేరేది కాదు’ అని అన్నారు.

Updated Date - 2023-02-09T02:14:05+05:30 IST