ఈటల రాజేందర్‌.. బీజేపీని వీడే ప్రశ్నే లేదు

ABN , First Publish Date - 2023-06-01T00:50:25+05:30 IST

తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పార్టీని వీడే ప్రశ్నే లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అదంతా బేస్‌లెస్‌, రాంగ్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు.

ఈటల రాజేందర్‌.. బీజేపీని వీడే ప్రశ్నే లేదు

ఈ ప్రచారం వెనుక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల కుట్ర

ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మే 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పార్టీని వీడే ప్రశ్నే లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అదంతా బేస్‌లెస్‌, రాంగ్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు మళ్లీ వెళ్లిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలే ఈ కుట్ర చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో బుధవారం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరేందుకు వెనుకాడుతున్నారన్న వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ... నాయకులు చేరినంత మాత్రాన గెలవమని, ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, రానున్న రోజుల్లో తమ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. అవినీతి, నియంతృత్వ ప్రభుత్వం, కుటుంబ పాలన పోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. గతంలో చేసిన చట్టం ప్రకారమే పునర్విభజన జరుగుతుందని, దక్షిణాదికి అన్యా యం జరుగుతుందనడం సరికాదన్నారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ట భారత్‌ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని, గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు సాయుధ బలగాల పరేడ్‌ నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-01T00:50:25+05:30 IST