PALAMURU : ‘పాలమూరు’కు పర్యావరణ అనుమతి లాంఛనమే!

ABN , First Publish Date - 2023-08-11T03:13:06+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతి త్వరలోనే రానుంది. ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ప్రాజెక్టుకు అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తాజాగా సిఫారసు చేసింది.

PALAMURU : ‘పాలమూరు’కు పర్యావరణ అనుమతి లాంఛనమే!

కేంద్రానికి ఈఏసీ సిఫారసు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం

దశాబ్దాల కల సాకారం: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతి త్వరలోనే రానుంది. ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ప్రాజెక్టుకు అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తాజాగా సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ నుంచి అనుమతి దక్కడం లాంఛనమే కానుంది. దీంతో రోజుకు 2 టీఎంసీలను తరలించేలా ప్రతిపాదిత 120 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేసుకోవడానికి వెసులుబాటు లభించనుంది. రూ.55,086 కోట్ల వ్యయంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాగునీటి అవసరాల పనులు చేపట్టడానికి తొలి దశ పర్యావరణ అనుమతి ఉంది. అయితే రెండో దశకు అనుమతి లేకపోవడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)తో పాటు సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. గత నెల జూలై 24న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ సమావేశమై.. రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల ఏ మేరకు పర్యావరణానికి హానీ జరిగిందనే అంశాన్ని చర్చించింది. రూ.153.69 కోట్ల మేర పర్యావరణ నష్టం జరిగినట్లు తెలంగాణ సమర్పించిన నివేదికతో ఏకీభవిస్తూ.. మూడేళ్ల కాలానికి గాను రూ.153.70 కోట్లతో నష్ట నివారణ ప్రణాళికతో పాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.153.70 కోట్ల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతో పాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని నిర్దేశించింది. దీన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఎ్‌సపీసీబీ)తో కలిసి, అమలు చేయాలని పేర్కొంది. ప్రణాళికను మూడేళ్లలో అమలు చేసిన తర్వాత బ్యాంకు గ్యారెంటీ విడుదలవుతుందని, అయితే బ్యాంకు గ్యారెంటీని ఐదేళ్ల కోసం సమర్పించాలని సూచించింది. పెనాల్టీని కాలుష్య నియంత్రణ మండలిలో జమచేయాలని నిర్దేశించింది. పనులు జరిగే ప్రదేశంలో వాయుకాలుష్యం నిర్ధారించడానికి వీలుగా మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రాజెక్టు నుంచి 10కి.మీ. లోపు వాటర్‌షెడ్‌ ప్రణాళిక అమలుతోపాటు ప్రజలకు సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పర్యావరణ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని తెలిపింది.

సీఎం కేసీఆర్‌ హర్షం

పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే రెండో దశ పనులు సైతం చకచకా ముందుకు సాగుతాయి. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పోరాడి అనుమతులు సాధించాం. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయం. కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘పాలమూరు పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడం కేసీఆర్‌ సాధించిన అపూర్వ విజయం. దశాబ్దాల కల సాకారమైంది. ప్రజల తలరాతను మార్చే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వ ఆనందాన్ని ఇస్తోంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-11T03:13:06+05:30 IST