Double Bedroom Houses: ఉన్నోళ్లకే డబుల్
ABN , First Publish Date - 2023-03-07T02:19:34+05:30 IST
ఉన్నోళ్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అర్హుల జాబితాలో చోటు.. లేనోళ్లకు మొండిచెయ్యి! కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఆశపడి.. నల్లగొండ జిల్లాలో ఆదరాబాదరాగా ‘డబుల్ ఇళ్ల’ సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారుల నిర్వాకమిది!!
ఆర్టీసీ, రిటైర్డ్ ఉద్యోగులు, శ్రీమంతులకు ఇళ్లు
నిరుపేదలైన అర్హులకు మాత్రం మొండిచెయ్యి
నల్లగొండ జిల్లాలో రెండ్రోజుల హడావుడి సర్వే
న్యాయం కోరుతూ బీజేపీ నేతల ఆధ్వర్యంలో
నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించిన పేదలు
నల్లగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఉన్నోళ్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అర్హుల జాబితాలో చోటు.. లేనోళ్లకు మొండిచెయ్యి! కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఆశపడి.. నల్లగొండ జిల్లాలో ఆదరాబాదరాగా ‘డబుల్ ఇళ్ల’ సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారుల నిర్వాకమిది!! ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. ఇళ్ల కోసం అర్హులైనవారి జాబితాను మార్చి మొదటి వారానికల్లా సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. ఒక్కో ఇంటికీ రూ.1.75 లక్షలు రాష్ట్ర ఖజానాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మునిసిపాలిటీలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాను రూపొందించి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే కేంద్రం నుంచి రూ.32 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. జిల్లాలో తొమ్మిదేళ్లుగా నిర్మాణం సాగుతున్న కొద్దిపాటి ఇళ్లను వెంటనే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెండు రోజుల్లోనే రెవెన్యూ యంత్రాంగం సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో డిప్యూటీ తహసీల్దార్‌కూ సుమారు 1,600 ఇళ్ల దరఖాస్తుల సర్వే బాధ్యతను అప్పగించింది.
కొన్ని వార్డుల్లో సర్వే క్షుణ్నంగా జరిగినా.. చాలా ప్రాంతాల్లో ఏదో ఒక చెట్టుకింద కూర్చుని అర్హుల జాబితాను రూపొందించారన్న ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు.. నల్లగొండ పట్టణంలో 38, 48 వార్డుల్లో ఆర్థికంగా స్థితిమంతులతో పాటు ఉద్యోగులు నివసిస్తున్నారు. 38వ వార్డులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 258 మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో 216 మందిని అర్హుల జాబితాలో చేర్చారు. ఇందులో 18 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కాయి. అదేవిధంగా 48వ వార్డులో 214 మందిని అర్హుల జాబితాలో చేర్చారు. అదే పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న కాలనీల్లో అర్హుల జాబితాలో 20 నుంచి 30 లోపే ఉండడం గమనార్హం. 36వ వార్డులో.. రెండంతస్తుల భవనం ఉన్న ఓ మహిళకు డబుల్ బెడ్‌రూం ఇల్లు డ్రాలో కేటాయించడం వివాదాలకు తావిస్తోంది. ఆ ఇంటి ఫొటోతో స్థానిక నిరుపేదలు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే, నల్లగొండ పట్టణంలో ఒక ఆర్టీసీ కండక్టర్‌కు, ఒక కానిస్టేబుల్ భార్యకు పింఛన్ వస్తున్నప్పటికీ డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరైంది. అలాగే ఒక హోంగార్డు కుటుంబానికి ఇల్లు దక్కడం చర్చనీయాంశంగా మారింది. 18 వార్డులో రెండు కుటుంబాలకు పెద్తఎత్తున వ్యవసాయ భూములతో పాటు విలువైన నివాస గృహాలున్నా వారిని అర్హుల జబితాలో చేర్చడం... వారికి ఇల్లు కూడా దక్కడం గమనార్హం.
41వార్డు శ్రీనివాస్ కాలనీలో ఓ వ్యక్తికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చింది. అదే కాలనీలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ వ్యక్తి కుమారుడికి ఇల్లు దక్కింది. 25వ వార్డులో ఓ మహిళ పేరిట ఇంతకుముందే ఇల్లు ఉన్నట్లుగా మునిసిపల్ రికార్డుల్లో ఉన్నా అధికారులు ఆమెను అర్హురాలిగా గుర్తించారు. డ్రాలో ఆమె పేరు వచ్చింది. అదే సమయంలో.. సామాన్య, మధ్య తరగతివారు జీవిస్తున్న 35వ వార్డులోని పద్మానగర్‌లో 280 దరఖాస్తులు వస్తే కేవలం 52 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. ప్రముఖుల ఒత్తిడితోనే అనర్హులు కూడా అర్హుల జాబితాలో చేరారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. సర్వేలో పూర్తిగా అక్రమాలు చోటుచేసుకోవడంతో ఆగ్రహించిన నిరుపేదలు రెండు రోజులుగా నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీలో ఆందోళన చేపడుతున్నారు. ఇల్లు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఓ మహిళ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ముట్టడి కార్యక్రమం జరిగింది. డబుల్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి అర్హులకు తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
అర్హత ఉన్నా అన్యాయం
పదేళ్లుగా పట్టణంలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నాను. చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. కూలినాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇటీవల డబుల్ బెడ్‌రూం కోసం దరఖాస్తు చేసుకోగా అర్హుల జాబితాలో ఎంపికైనా డ్రాలో మాత్రం ఇల్లు దక్కలేదు. ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు వస్తున్నాయి. మాలాంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి.
- దేశ సోమమ్మ, నల్లగొండ
విచారణ చేస్తున్నాం
డబుల్ బెడ్‌రూం ఇల్లు దక్కించుకున్న లబ్ధిదారులందరి నుంచీ అఫిడవిట్ తీసుకుంటున్నాం. వారు అనర్హులని తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికేఈ అఫిడవిట్లు. డబుల్ ఇళ్లకు ఎంపికై వారి పేర్లను సమగ్ర కుటుంబ సర్వే సాఫ్ట్‌వేర్‌తో వడపోసి విచారణ చేస్తున్నాం.
- భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్