Election Cinematic glamour :ఎన్నికలకు గ్లామర్‌ కళ!

ABN , First Publish Date - 2023-03-04T04:59:05+05:30 IST

నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్‌ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్‌ మాత్రమే పోటీ చేశారు! ఈసారి,

Election Cinematic glamour :ఎన్నికలకు గ్లామర్‌ కళ!

ఈసారి దాదాపు పదిమంది సినీ ప్రముఖుల ఆసక్తి

బీఆర్‌ఎస్‌ తరఫున పోటీకి నిర్మాత దిల్‌ రాజు ఆసక్తి

ప్రకాశ్‌ రాజ్‌ తెలంగాణ నుంచా.. కర్ణాటక నుంచా!?

‘జైబోలో తెలంగాణ’ దర్శకుడు శంకర్‌కు ఈసారి చాన్స్‌

యువ హీరో నితిన్‌ను దింపాలని బీజేపీ పావులు

విజయశాంతి, జీవిత, బాబూమోహన్‌ కూడా

కాంగ్రెస్‌ నుంచి సీటు ఆశిస్తున్న కత్తి కార్తీక

జనసేన నుంచి నిర్మాత రామ్‌ తాళ్లూరి బరిలోకి!

హోరాహోరీ..! పోటా పోటీ..! నువ్వా నేనా..! తెలంగాణలో ఈసారి ఎన్నికలకు పర్యాయ పదాలివి! ఇప్పుడు అదనంగా సినీ గ్లామర్‌ కూడా తోడు కానుంది! వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని దాదాపు పదిమంది సినీ ప్రముఖులు ఉవ్విళ్లూరుతున్నారు! వారిలో ఎంతమందికి ఆయా పార్టీలు టికెట్లు ఇస్తాయో వేచి చూడాల్సిందే!

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్‌ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్‌ మాత్రమే పోటీ చేశారు! ఈసారి, వీరికితోడు నిర్మాతలు దిల్‌ రాజు, రామ్‌ తాళ్లూరి, దర్శకుడు శంకర్‌, సినీ నటులు నితిన్‌, జీవిత, కత్తి కార్తీక తదితరులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ప్రముఖ నిర్మాత, డిస్ర్టిబ్యూటర్‌ దిల్‌ రాజు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన ఆయన.. ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ రంగంపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఆయన.. అన్నీ అనుకూలిస్తే ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక, విలక్షణ నటుడు ప్రకా్‌షరాజ్‌ కూడా బీఆర్‌ఎ్‌సకు సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో ఆయన హైదరాబాద్‌ నగరంలోని ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం బీఆర్‌ఎస్‌ తరఫున పోటీలో ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. కొంతకాలం కిందట ఆయన సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌ్‌సలో కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తెలంగాణ నుంచి పోటీ చేస్తారా!? లేకుంటే బీఆర్‌ఎస్‌ తరఫున కర్ణాటకలో ఎక్కడి నుంచైనా బరిలోకి దిగుతారా!? అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఇక, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గానికి చెందిన దర్శకుడు ఎన్‌.శంకర్‌ పేరు కూడా ఈసారి పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలు తీసిన ఆయనకు.. జై బోలో తెలంగాణ సినిమాతో మంచి పేరొచ్చింది. 2014 ఎన్నికల్లోనే ఆయనకు కాంగ్రెస్‌ తరఫున మిర్యాలగూడ నుంచి అవకాశం ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. అందుకు ఆయన సుముఖత చూపలేదు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీకే ఆసక్తి చూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఆయనకు అధికార పార్టీలో ఏదైనా ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన పేరును పరిశీలిస్తారని తెలిసింది. ఇక జైబోలో తెలంగాణ సినిమాలోనే హీరోగా నటించిన రోషన్‌ బాలు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈయన కూడా గత ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించారు. కానీ, దక్కలేదు.

బీజేపీ నుంచి యువ హీరో నితిన్‌!

ఈసారి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ యువ హీరో నితిన్‌పై దృష్టి పెట్టిందని సమాచారం. ఆయనను రంగంలోకి దించే అవకాశాలను ఆ పార్టీ పరిశీలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోటీ చేయాలనే ఆకాంక్ష నితిన్‌కు లేదు. కానీ, బీజేపీ తన వ్యూహంలో భాగంగా బరిలోకి దిగాలని ఆయనను అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా నితిన్‌ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఇక, ఈసారి విజయశాంతి బీజేపీ నుంచి బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి కచ్చితంగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభను టార్గెట్‌ చేసిన పార్టీ వ్యూహంలో భాగంగా ఆమె అసెంబ్లీ బరిలోకే దిగే అవకాశాలున్నాయి. ఇంకోవైపు, ఇటీవల పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగనున్నారు. ఆమె జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. ఇక, బాబూ మోహన్‌ ఎప్పట్లాగే ఆందోళ్‌ నుంచి బరిలో దిగనున్నారు.

కాంగ్రెస్‌ నుంచి కత్తి కార్తీక.. జన సేన నుంచి రామ్‌ తాళ్లూరి

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, టీవీ ఆర్టిస్ట్‌ కత్తి కార్తీక కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. దుబ్బాక నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయనున్న జనసేన తరఫున కూడా ఒకరిద్దరు సినీ రంగానికి చెందినవారు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఖమ్మం జిల్లాకు రామ్‌ తాళ్లూరి జనసేన పార్టీలో ఉన్నారు. చుట్టాలబ్బాయి, నేల టికెట్‌, డిస్కో రాజా తదితర సినిమాలు నిర్మించిన ఈ ఎన్‌ఆర్‌ఐ నిర్మాత జనసేన తరఫున ఖమ్మం జిల్లాలో ఒక స్థానం నుంచి బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నారు.

Updated Date - 2023-03-04T07:12:00+05:30 IST