ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదు

ABN , First Publish Date - 2023-08-25T04:19:01+05:30 IST

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి హైకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదు

ట్రాఫిక్‌ చలానాల వివరాలు వెల్లడించలేదు

భూములు, రుణాల విషయాన్నీ చెప్పలేదు: హైకోర్టు

కృష్ణమోహన్‌రెడ్డి అఫిడవిట్‌పై 2019లో డీకే అరుణ వ్యాజ్యం

స్పందించని ఎమ్మెల్యే

ఎక్స్‌పార్టీ తీర్పు వెల్లడి

డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

తప్పుడు అఫిడవిట్‌ దాఖలుకు రూ.2.50 లక్షల జరిమానా

పిటిషనర్‌ ఖర్చులకు 50 వేలు ఇవ్వాలని ఆదేశాలు

సుప్రీంను ఆశ్రయిస్తా: బండ్ల

హైదరాబాద్‌/గద్వాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి హైకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఆయనపై పోటీచేసి, రెండోస్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.50 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్‌ ఖర్చుల కింద డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌స(అప్పట్లో టీఆర్‌ఎస్‌) నుంచి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ పోటీచేశారు. లక్ష ఓట్లతో ఘనవిజయం సాధించిన కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

డీకే అరుణ ఆయన సమీప ప్రత్యర్థిగా 71,612 ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, ఇతర వివరాలను తప్పుగా వెల్లడించారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ డీకే అరుణ 2019 జనవరి 30న హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌(ఈపీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. అరుణ తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో.. గద్వాల మండలం పుద్దూరులో 24.09 ఎకరాలకు యజమానిగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి.. ఆ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని వివరించారు. హైకోర్టుకు గతంలో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆ భూములు తనవేనని వెల్లడించినట్లు గుర్తుచేశారు. గద్వాల ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఖాతాల వివరాలు.. వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు, రుణాల వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. ప్రతివాది, ఆయన భార్య వాహనాలపై ట్రాఫిక్‌ చలానాలున్నాయని.. వాటిని చెల్లించలేదని, ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు.

ఎమ్మెల్యే తరఫున లేని ప్రాతినిధ్యం..

కృష్ణమోహన్‌రెడ్డిపై 2019లో ఎన్నికల పిటిషన్‌ దాఖలు కాగా.. ఆయనగానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ హైకోర్టు విచారణకు హాజరవ్వలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్‌ డీకే అరుణ పత్రికా ప్రకటనల ద్వారా మరోసారి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి స్పందన లేకపోవడంతో పిటిషనర్‌, ఇతర ప్రతివాదుల వాదనలు, సాక్ష్యాధారాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. జూన్‌ 22న తీర్పును రిజర్వు చేసింది. ఈ చర్య తర్వాత స్పందించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి.. తన వాదనలు వినాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాదుల ద్వారా మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు రిజర్వు చేసిన తర్వాత ఎలాంటి మధ్యంతర దరఖాస్తులను ఆమోదించబోమని పేర్కొన్న ధర్మాసనం.. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు నిర్ధారణకు వచ్చిన ధర్మాసనం.. గురువారం ఎక్స్‌పార్టీ తీర్పునిచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి ఎన్నిక చెల్లదని.. డీకే అరుణను 2018 డిసెంబరు నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలని పేర్కొంటూ సంచలన ఉత్తర్వులను జారీచేసింది.

డీకే అరుణ లేవనెత్తిన అంశాలివే..

కృష్ణమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల సమయంలో గద్వాల మండలం పూడూరు వద్ద తన భార్య జ్యోతి పేరుతో గోదాములున్నట్లు చూపించారు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆ గోదాముల వివరాలను ప్రస్తావించలేదు.

బండ్ల జ్యోతి పేరుతో మారుతి స్విప్ట్‌ డిజైర్‌ కారు(ఏపీ03బీవై-8979)ను కూడా 2018 అఫిడవిట్‌లో చూపించలేదని పేర్కొన్నారు.

కృష్ణమోహన్‌రెడ్డి వాదనల ప్రకారం 2014 తర్వాత పూడూరువద్ద ఉన్న గోదాంలను 2018 ఫిబ్రవరిలో నే అమ్మేశారు. నవంబరు తర్వాత ఇచ్చిన అఫిడవిట్‌లో ఆ వివరాలు నమోదుచేయలేదు. కారుకు యాక్సిడెంట్‌ అయిన తర్వాత అమ్మేశామని చెబుతున్నారు. ఆకారుపై ఓవర్‌స్పీడ్‌ చలానాలుండడం.. కృష్ణమోహన్‌రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించకపోవడంతో ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చింది: డీకే అరుణ

హైకోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కోర్టు తీర్పు వెలువడ్డాక ఆమె జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గద్వాల ప్రజలు కూడా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ‘‘ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా సమర్పించే అఫిడవిట్‌లో అన్ని వాస్తవాలనే పేర్కొనాలి. కానీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాస్తవాలను దాచారు. హైకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, తుది తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ తీర్పు ఆలస్యమైంది. రెండుమూడేళ్ల ముందే తీర్పు రావాల్సింది. ఆలస్యమైనా న్యాయం జరిగింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-25T04:32:32+05:30 IST