హరికృష్ణ లీలలపై మంత్రికి ముందే తెలుసా?

ABN , First Publish Date - 2023-08-16T03:34:15+05:30 IST

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీగా సస్పెండైన హరికృష్ణ, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఉద్యోగులను సతాయిస్తున్నారనే విషయం ఆరు నెలల క్రితమే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తెలుసా

హరికృష్ణ లీలలపై మంత్రికి ముందే తెలుసా?

ఆరు నెలల క్రితమే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి..

తీసుకెళ్లింది సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకుడే

స్పందించకపోగా ఉల్టా ఆయనకే బెదిరింపులు

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు చెబుతానంటే

చెప్పుకోపో.. అంటూ నిర్లక్ష్యపు సమాధానం

ట్విటర్‌ ద్వారా ఎమ్మెల్సీ కవితకు వివరించిన అనిల్‌

అక్కా.. శ్రీనివాస్‌గౌడ్‌ పెద్ద దొంగ.. నమ్మొద్దని ట్వీట్‌!

హాకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఘటనలో కొత్తకోణం

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి)/క్రీడాప్రతినిధి: హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీగా సస్పెండైన హరికృష్ణ, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఉద్యోగులను సతాయిస్తున్నారనే విషయం ఆరు నెలల క్రితమే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తెలుసా? హరికృష్ణ తీరుపై ఓ బీఆర్‌ఎస్‌ నేత ఫిర్యాదు చేసినా శ్రీనివాస్‌ గౌడ్‌ ఏమాత్రం పట్టించుకోలేదా? అంటే.. గతంలో ఆ స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన మిత్రుడు భాగస్వామిగా మెస్‌ను నిర్వహించి, హరికృష్ణను దగ్గరి నుంచి చూసిన సిరిసిల్ల జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత అబ్బాడి అనిల్‌ కుమార్‌ రెడ్డి ఔను అనే అంటున్నారు. ఈ విషయాలను అనిల్‌ కుమార్‌ రెడ్డి ట్విటర్‌ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్‌ స్కూల్‌లో అక్కడి సిబ్బంది, విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ‘ఇక్కడా ఓ బ్రిజ్‌ భూషణ్‌.!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఎమ్మెల్సీ కవిత వెంటనే స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను ఆమె కోరారు. కాగా కవిత ట్వీట్‌ను గమనించిన బీఆర్‌ఎస్‌ నేత అనిల్‌ కుమారెడ్డి, ఆమెకు ఓ రీట్వీట్‌ చేశారు.

హరికృష్ణ వ్యవహరిస్తున్న తీరు గురించి ఆరు నెలల క్రితమే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తాను ఫోన్‌ చేసి చెప్పానని, ఆయన స్పందించకపోగా తిరిగి తననే బెదిరంచారని అనిల్‌ కుమార్‌ రెడ్డి వాపోయారు. ‘‘అక్కా.. ఇదే విషయాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌కు చెబుతాను అంటే.. చెప్పుకో అంటూ బెదిరించాడు. అక్కా.. శ్రీనివాస్‌ గౌడ్‌ పెద్ద దొంగ అతని మాటలు నమ్మొద్దు’’ అంటూ రీట్వీట్‌ చేశారు. విద్యార్థినులపై హరికృష్ణ లైంగిక ఆరోపణలకు సంబంధించి అనిల్‌ కుమార్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. స్పోర్ట్స్‌ హాస్టల్‌లోని మెస్‌ను తన మిత్రుడితో కలిసి కొద్ది నెలలు కిందట వరకు నిర్వహించానని చెప్పారు. ఆ సమయంలో హరికృష్ణ ప్రవర్తన, వ్యవహారశైలి గురించి పలు విషయాలను ఆయన వెల్లడించారు. స్కూల్‌లో హరికృష్ణ, తాను ఏర్పాటుచేసుకున్న ఓ ఇద్దరు అనుచరులతో కలిసి పాఠశాలలోని జిమ్‌, ఆర్చరీ ప్రాక్టీసు చేసే ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మద్యం సేవించేవారని అన్నారు. మందు తాగాక మెస్‌ వద్దకు వెళ్లి చికెన్‌ వండండి, మటన్‌, చేపలు తెప్పించండంటూ అక్కడి వంట చేసేవాళ్లతో గొడవ పడేవారని తెలిపారు. వంట చేసే సిబ్బందితో అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరించేవారని, ఒక్కోసారి వాళ్లను కొట్టి, మెస్‌లోని వంట సామాన్లను చెల్ల్లాచెదురు చేసేవారని వెల్లడించారు. రాత్రివేళల్లో బాలికల హాస్టల్‌లో కూడా తిరిగేవారని, ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని వాపోయాడు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తే అన్ని విషయాలు బయటపడుతాయన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న కమిటీ ముందు హాజరై జరిగిన విషయాలను చెబుతానని తెలిపారు.

Updated Date - 2023-08-16T03:34:15+05:30 IST