డబ్బులు కడతారా... ఇంటికి తాళం వేయమంటారా?
ABN , First Publish Date - 2023-03-03T04:08:36+05:30 IST
డబ్బులు కడతారా లేక ఇంటికి తాళం వేయమంటారా అంటూ బ్యాంకు అధికారులు ఓ రైతు పట్ల జులుం ప్రదర్శించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి
గొర్రెలు, మేకలు ఉంటే అమ్మి కట్టండి
రైతుపై బ్యాంకు అధికారుల జులుం
వికారాబాద్ జిల్లాలో ఘటన
పెద్దేముల్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): డబ్బులు కడతారా లేక ఇంటికి తాళం వేయమంటారా అంటూ బ్యాంకు అధికారులు ఓ రైతు పట్ల జులుం ప్రదర్శించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె మక్తలయ్యకు 3.13 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌మెంట్ భూమి ఉంది. వ్యవసాయ పెట్టుబడి కోసం 2019లో తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. లక్షా 36వేలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.2లక్షల 15వేలు అయ్యింది. అలాగే 2014లో రీషెడ్యూల్ కింద ఇచ్చిన రూ.50వేల టర్మ్‌లోన్ ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.80వేలకు చేరింది. అయితే ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో రుణభారం కొంతమేర తగ్గుతుందని రైతు ఆశపడ్డారు. కానీ రుణమాఫీ ఇంకా కాలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఆ రైతుకు నోటీసులు పంపించారు. అయినా రైతు డబ్బులు చెల్లించలేదు. దీంతో అధికారులే రైతు ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాళం చేతపట్టుకుని వచ్చిన బ్యాంకు అధికారులు డబ్బులు కడతారా లేక ఇంటికి తాళం వేయమటారా? అని రైతును ప్రశ్నించారు. గొర్రెలు మేకలు ఏమైనా ఉంటే అమ్మికట్టాలని, కట్టేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఇంటిముందు తిష్టవేశారు. దీంతో రైతు ఆందోళనకు గురయ్యారు. రైతు కుమారుడు తాను పనిచేసే చోట రూ.5వేలు అప్పు తీసుకొచ్చి బ్యాంకులో చెల్లించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో... రైతు ఇంటికి తాళం వేయలేదని, వేస్తామని బెదిరించలేదని, అప్పు చెల్లించాలని మాత్రమే అడిగామని బ్యాంకు అధికారులు వివరించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రుణమాఫీ చేయాలని హన్మాపూర్ మాజీ సర్పంచ్ లొంక నర్సింలు డిమాండ్ చేశారు.