గోండు, ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చు పెట్టొద్దు
ABN , First Publish Date - 2023-06-26T02:30:09+05:30 IST
తెలంగాణలో గోండు, ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దని.. గిరిజన బంధు, గిరిజన బీమాను వెంటనే ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు. ఆదివారం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
పంజాగుట్ట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గోండు, ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దని.. గిరిజన బంధు, గిరిజన బీమాను వెంటనే ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ అధ్యక్షతన గిరిజన సమస్యల పరి ష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు 50ు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ ఏడాది సబ్‌ప్లాన్ నిధులు మిగిలితే వచ్చే ఏడాది వాటిని వాడుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆరోపించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి గిరిజన, ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాలున్నాయని, వీరికి రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ గిరిజన ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిందని, ఆ భయానికే పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. గిరిజన బంధు, బీసీ బంధు పథకాలను వెంటనే ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సమావేశంలో రాంబాబు నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, వివిధ గిరిజన, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులుపాల్గొన్నారు.