విభజించి పాలిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2023-03-02T02:51:15+05:30 IST
దేశం, రాష్ట్రాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ విభజించి పాలిస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
దేశ సమగ్రత కోసమే రాహుల్ యాత్ర
ఆ సందేశాన్ని ప్రజలకు చేర్చాలి: ఠాక్రే
కార్యకర్తలతో సమీక్ష సందర్భంగా భగ్గుమన్న విభేదాలు
దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం
కోదాడ, మార్చి 1: దేశం, రాష్ట్రాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ విభజించి పాలిస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నాయని దుయ్యబట్టారు. హాత్ సే హాత్ జోడోయాత్రను ప్రారంభించేందుకు బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడకు వచ్చిన ఆయన కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశ సమగ్రతను కాపాడేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేషస్పందన లభించిందన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాల విధానాలను ఎండగట్టేందుకే రాహుల్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. హాత్ సే హాత్ జోడోయాత్రతో గడపగడపకూ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోపాటు రాహుల్ సందేశాన్ని ప్రజలకు చేర్చాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో యాత్రలు ఉంటాయని, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. మాణిక్‌రావుఠాక్రే ఆధ్వర్యంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జోడో యాత్ర సాగుతుందని, కోదాడ నుంచి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
కోదాడలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఎదుటే ఆ పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమే్‌షరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పటేల్ రమే్‌షరెడ్డి, అతడి అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాణిక్‌రావుఠాక్రే, ఎంపీ ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.