High Court : ఇదేం ధరణి?

ABN , First Publish Date - 2023-05-05T03:16:35+05:30 IST

ఒక సర్వే నంబర్‌లోని ఓ బిట్టుపై వివాదం ఉంటే.. మొత్తం సర్వే నంబర్‌ నిషేధిత జాబితాలోకే..! ఒక సర్వే నంబర్‌లో కొంత భాగాన్ని వ్యవసాయం నుంచి వ్యవసాయేతర కేటగిరీకి మారిస్తే.. మొత్తం సర్వే

 High Court : ఇదేం ధరణి?
High Court

  • ఒక్క బిట్టుపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్‌పైనే నిషేధమా?

  • ఒక బిట్టును ‘నాలా’ జాబితాకు మారిస్తే మొత్తం సర్వే నంబర్‌ ఆ జాబితాలోకేనా?

  • మిస్సింగ్‌ సర్వే నంబర్లను చేర్చే ఆప్షన్‌ లేదు..

  • తప్పుడు ఎంట్రీలను మార్చే అవకాశం లేదు ఉమ్మడి పట్టాదారుల మధ్య విభజన ఎలా?..

  • భూ సేకరణలో డిలీట్‌ ఆప్షన్‌ నిల్‌ ‘రెవెన్యూ’ను తప్పుబట్టిన బెంచ్‌..

  • 20 సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశం

  • మేమిచ్చిన అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వండి..

  • సీఎస్‌, సీసీఎల్‌ఏకు హైకోర్టు ఆదేశాలు

గుర్తించిన సమస్యల్లో కొన్ని..

‘పొరపాటున’ ఏదైనా సర్వే నంబర్‌ నిషేధిత జాబితాలో చేరినా.. ప్రభుత్వ భూమి అని నమోదైనా.. దానిని మార్చడానికి ఎటువంటి ఆప్షన్‌ అందుబాటులో లేదు.

ఉమ్మడిగా కొనుగోలు చేసిన భూమి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య భూమిని హక్కు దారుల మధ్య విభజించడానికి ఆప్షన్‌ లేదు.

చనిపోయిన అమ్మకందారుకు సంబంధించిన లీగల్‌ హెయిర్స్‌ నుంచి పట్టా పొందే ఆప్షన్‌ ధరణిలో లేదు.

మిస్సింగ్‌ సర్వే నంబర్లను చేర్చడానికి, తప్పుడు ఎంట్రీలను మార్చడానికి ఆప్షన్‌ లేదు.

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఒక సర్వే నంబర్‌లోని ఓ బిట్టుపై వివాదం ఉంటే.. మొత్తం సర్వే నంబర్‌ నిషేధిత జాబితాలోకే..! ఒక సర్వే నంబర్‌లో కొంత భాగాన్ని వ్యవసాయం నుంచి వ్యవసాయేతర కేటగిరీకి మారిస్తే.. మొత్తం సర్వే నంబర్‌ ‘నాలా’ జాబితాలోకే..! ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఆర్‌ కొత్త చట్టంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో ఉన్న ప్రధాన లోపాలు. అంతేనా.. ఏదైనా ఒక సర్వే నంబర్‌లో కొంత భాగాన్ని మార్చే అవకాశమే లేదు. ఉమ్మడి పట్టాదారుల మధ్య భూవిభజనకు ఆప్షనే లేదు. మ్యుటేషన్‌ సమయంలో తనిఖీకి(వెరిఫికేషన్‌) అధికారులకు అవకాశమే ఉండదు. అందుక్కారణం.. లింక్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసే అవకాశం లేకపోవడమే..! ఇక ధరణిలో డేటా ఎంట్రీ సమయంలో కొన్ని సర్వే నంబర్ల ఎంట్రీ(మిస్సింగ్‌ సర్వే నంబర్లు) జరగకుంటే.. వాటిని తిరిగి చేర్చే చాన్సే లేదు. అధికారులెవరైనా తప్పుడు ఎంట్రీలను గుర్తించినా.. వాటిని మార్చేందుకూ అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత ఆర్వోఆర్‌ చట్టం–1971 స్థానంలో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌ 2020(కొత్త ఆర్వోఆర్‌ చట్టం), ధరణి పోర్టల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఆర్వోఆర్‌ చట్టంలో పేర్కొన్న నిర్ణీత పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో భూయజమానులు, రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీటిని విచారించిన హైకోర్టు కూడా ఈ లోపాలను ఎత్తి చూపుతూ.. రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. 20 సమస్యలను ఎత్తిచూపింది. ‘‘ఇవి కేవలం ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్ల ద్వారా మా దృష్టికి వచ్చిన అంశాలు. ఇంకా మా దృష్టికి రానివి ఎన్నో ఉండి ఉంటాయి. వాటిని కూడా సరిచేయాల్సిందే’’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల స్పష్టం చేసింది. ఇటీవల భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ను స్వయంగా కోర్టుకు పిలిపించి.. వివరణ తీసుకుంది. ధరణిలో 20 ప్రధాన సమస్యలను గుర్తించిన హైకోర్టు.. వాటిని సీఎస్‌, సీసీఎల్‌ఏలకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే, ధరణి పోర్టల్‌ ఉద్దేశాలు నెరవేరుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తద్వారా కోర్టుల్లో కేసులు తగ్గుతాయని అభిప్రాయపడింది. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల నుంచి, ఆయా జిల్లాల కలెక్టర్‌ల ద్వారా అభిప్రాయాలు తీసుకోవాలని.. అన్ని స్థాయుల్లో సాధారణంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలని తెలిపింది. తాము గుర్తించిన సమస్యలకు తక్షణమే పరిష్కరించాలని, నాలుగు వారాల్లో యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌(ఏటీఆర్‌)ను సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చేనెల 15కు వాయిదా వేసింది.

హైకోర్టు గుర్తించిన సమస్యలివే..!

● డేటా సవరణకోసం పెట్టుకున్న ఆన్‌లైన్‌ అర్జీలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిర్ణీత సమయంలో ఈ–పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను జారీ చేయడం లేదు

● సర్వే కోసం పెట్టుకున్న ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిర్ణీత కాలవ్యవధిలో సబ్‌–డివిజన్‌ సర్వేను పూర్తిచేయడం లేదు

● యాక్షన్‌ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు జారీచేసిన ‘సేల్‌ సర్టిఫికెట్‌’లను పరిగణనలోకి తీసుకోవడం లేదు

● అమ్మకం లావాదేవీలను సకాలంలో పూర్తిచేయడానికి ధరణిలో అప్‌లోడ్‌ చేసిన జనరల్‌, స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ)లను పరిగణనలోకి తీసుకోవడం లేదు

● ఏ కారణాలు తెలుపకుండా.. ఆన్‌లైన్‌, ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులను ‘రిజెక్ట్‌’ అనే ఒకేఒక్క పదంతో తిరస్కరిస్తున్నారు

● సరైన మాడ్యూల్‌లో దరఖాస్తులు సమర్పించలేదనే కారణంతో మరో చాన్స్‌ ఇవ్వకుండా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు

● సెక్షన్‌ 7కు లిమిటేషన్‌ పీరియడ్‌ ఏమిటో వివరంగా చెప్పలేదు. ఎప్పటి నుంచి(నిర్ణీత సమయం) ఉన్న కోర్టు డిక్రీలు పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తారనేదానిపై సరైన వివరణ లేదు

● ఏదైనా దరఖాస్తును సరైన మాడ్యూల్‌లో కాకుండా తప్పుగా మారో మాడ్యూల్‌లో సమర్పిస్తే.. ‘అది తప్పు.. ఫలానా మాడ్యూల్‌లో దరఖాస్తు చేయండి..’ అని డిస్‌ప్లేలో చూపించాలి. అలాంటి వ్యవస్థ ఏదీ లేదు

● పాత ఆర్వోఆర్‌ యాక్ట్‌–1971 లోని సెక్షన్‌ 5(బీ), 5(5), 9 కింద రెవెన్యూ అధికారులు జారీచేసిన ఆదేశాలపై అప్పీల్‌ లేదా రివిజన్‌కు అవకాశం కల్పించే ప్రొవిజన్లు లేవు. దీనివల్ల కొత్త చట్టం రాకముందు రెవెన్యూ అధికారులు జారీచేసిన ఆదేశాలను సవాల్‌ చేయడానికి తెలంగాణ జనరల్‌ క్లాజెస్‌ యాక్ట్‌–1891 కింద అప్పీళ్లకు అవకాశం ఇవ్వాలని కక్షీదారులు పిటిషన్‌లు వేస్తున్నారు. దీనిపై స్పష్టత లేదు

● కోర్టు కేసులు, స్టే ఆర్డర్లు, ఇంజెక్షన్‌ ఆర్డర్స్‌లో ఉన్న సర్వే నంబర్‌లను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. కేవలం వివాదంలో ఉన్న భాగం భూమిని మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టేలా ధరణిలో మార్పులు చేయాలి

● వ్యవసాయ కేటగిరీ నుంచి వ్యవసాయేతర విభాగానికి మారిన భూమి మాత్రమే కాకుండా.. ఆ భూమి ఉన్న మొత్తం సర్వే నంబర్‌ను ‘నాలా’ జాబితాలో చూపిస్తున్నారు

● ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదైన భూమిలో కొంత భాగాన్ని మార్చడానికి ఎటువంటి ఆప్షన్‌ లేదు

● మ్యుటేషన్‌ చేయాలని కోరుతున్న వ్యక్తికి ఉన్న టైటిల్‌ను తనిఖీ చేయడం అధికారులకు కష్టమైన పనిగా మారింది. మ్యుటేషన్‌ చేయాలని కోరుతున్న భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసే విధంగా ధరణి పోర్టల్‌లో ఆప్షన్‌ ఉండాలి. దానివల్ల మరింత విశ్వసనీయత, ఆధారాలకు విలువ పెరుగుతాయి

ప్రత్యేక ట్రైబ్యునళ్లకు అప్పీళ్లేవి?

పాత ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై అప్పీళ్లు, రివిజన్‌ పిటిషన్‌లను– కొత్త ఆర్వోఆర్‌ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైబ్యునళ్లకు పంపాలి. అలాంటి అప్పీళ్లను ఇప్పటికీ ప్రత్యేక ట్రైబ్యునళ్లకు పంపలేదు.

‘కోర్టు డిక్రీ’లో స్పష్టత లేదు

ఆర్వోఆర్‌ చట్టం సెక్షన్‌ 7లో పేర్కొన్న ‘కోర్టు డిక్రీ’ అనే పదంలో స్పష్టత లోపించింది. టైటిల్‌లో మార్పులకు సంబంధించిన డిక్రీలు మాత్రమేనా..! ఇతర సివిల్‌ కేసుల్లో కోర్టులు ఇచ్చిన డిక్రీలు సైతం ‘కోర్టు డిక్రీ’ అనే పదం పరిధిలోకి వస్తాయా? అనేదానిపై స్పష్టత లేదు

డిలీట్‌ ఆప్షనే లేదు

భూయజమాని నుంచి ప్రభుత్వం భూమి సేకరించిన తర్వాత.. ఆ భూమిని డిలీట్‌ చేయడానికి ఎటువంటి ఆప్షన్‌ అందుబాటులో లేదు. అలాగే ప్రభుత్వం అసైన్‌ చేసిన భూముల వివరాలు కూడా ధరణిలో కనిపించడం లేదు.

Updated Date - 2023-05-05T03:16:35+05:30 IST