అక్రమాలకు అడ్డాగా ధరణి: భట్టి
ABN , First Publish Date - 2023-05-27T03:38:03+05:30 IST
బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలకు ధరణి అడ్డాగా మారిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

తిమ్మాజిపేట, మే 26: బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలకు ధరణి అడ్డాగా మారిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇళ్లు లేవని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువయ్యాయని ఆయన విమర్శించారు. 42 వేల కోట్లతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తిమ్మాజిపేటలో భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి తాను చేపట్టిన యాత్రలో.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన రెండు పడక గదుల ఇళ్లు గ్రామాల్లో తనకు ఎక్కడా కనిపించలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తాను మాట్లాడిన సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకులకు అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని ప్రకటించారు.