Health Minister Harish : గ్రేటర్‌లో లక్ష మందికి సీపీఆర్ శిక్షణ
ABN , First Publish Date - 2023-03-02T03:16:15+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీపీఆర్‌పై ఒక్క హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. బుధవారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్‌ఐ వేదికగా సీపీఆర్ శిక్షణా
వైద్యంలో దేశానికే తలమానికంగా తెలంగాణ: కేటీఆర్..
మేడ్చల్‌లో సీపీఆర్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
తెలంగాణలో ఏటా 24 వేల మంది గుండెపోటుతో మృతి: హరీశ్
రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్/మేడ్చల్ మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీపీఆర్‌పై ఒక్క హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. బుధవారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్‌ఐ వేదికగా సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి సంయుక్తంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన దేశం ఇప్పుడు డయాబెటిస్ హబ్‌గా మారి, గుండెపోట్లు పెరిగాయన్నారు. ఇందుకు రెండే కారణాలని ఒకటి జీవనశైలి మారడం, రెండోది గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహ న లేకపోవడమేనన్నారు. ఇటీవలే తన మామ కూడా హార్ట్ స్ట్రోక్‌తో కన్నుమూసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే అంశంపై మంత్రి హరీశ్‌తో చర్చించి, సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా డీఫిబ్రిలేటర్ ఏర్పాటు చేయాలని హరీశ్‌ను కోరారు. సీపీఆర్‌పై హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్యంలో దేశానికే తలమానికంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. హైదరాబాద్‌కు నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో అతి పెద్ద ఆస్పత్రి, బస్తీ దవాఖానాలు, కంటి వెలుగు.. ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా హరీశ్ సారథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ నంబర్ వన్‌గా నిలుస్తోందని వెల్లడించారు.
ఏటా 24 వేల మంది బలి..
ఈ సీపీఆర్ శిక్షణ ఆలోచన కేటీఆర్‌దేనని మంత్రి హరీశ్ అన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్టయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది, రాష్ట్రంలో 24 వేల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఆర్ ద్వారా మృతుల సంఖ్యను తగ్గించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేయగలిగితే 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చని చెప్పారు. జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు.. సోషల్ మీడియా, టీవీల్లో చూస్తున్నామన్నారు. సీపీఆర్ చేసేందుకు చదువు, మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదన్నారు. ఎవ్వరైనా సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సీపీఆర్ శిక్షణను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని, వైద్యారోగ్య, పోలీసు, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల వారందరికీ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గేటేడ్ కమ్యూనిటీ, సె క్యూరిటీ, వాచ్ మెన్, అసోసియేషన్, బస్తీల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, పంచాయతీల్లో, మున్సిపాలిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు ఇలా అందరికీ శిక్షణ ఇస్తామన్నారు. మొదటి దశలో భాగంగా రూ.18 కోట్లతో 1200 ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ మెషీన్ల ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్స్ జిల్లాల్లో కలెక్టర్ల అధ్వర్యంలో అన్ని శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తారని వెల్లడించారు. సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్, వరంగల్ డీఎంహెచ్‌వో వెంకటరమణను మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాస్ రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.