నువ్వులేని లోకంలో నేనుండలేను

ABN , First Publish Date - 2023-05-26T04:17:08+05:30 IST

ఆ జంటకు ఏడాది క్రితం పెళ్లయింది.. సంతోషంగా సాగుతున్న జీవితం.. వారి అదృష్టాన్ని, ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయిన విధి వారిని వెక్కిరిచ్చినట్లుంది. ఊహించనిరీతిలో హఠాత్తుగా భర్త

నువ్వులేని లోకంలో నేనుండలేను

గుండెపోటుతో భర్త మృతి.. అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే భార్య ఆత్మహత్య

అంబర్‌పేట, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆ జంటకు ఏడాది క్రితం పెళ్లయింది.. సంతోషంగా సాగుతున్న జీవితం.. వారి అదృష్టాన్ని, ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయిన విధి వారిని వెక్కిరిచ్చినట్లుంది. ఊహించనిరీతిలో హఠాత్తుగా భర్త ప్రాణాలు కోల్పోయాడు. భర్త దూరమవడాన్ని జీర్ణించుకోలేపోయిందా భార్య. భర్త అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన బాగ్‌ అంబర్‌పేటలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మనోజ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే సాహితి, మనోజ్‌లు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిపోయారు. డల్లాస్‌లో ఉద్యోగం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటున్నారు. కన్నవారిని చూసేందుకు సాహితి ఈ నెల 2న హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె వచ్చిన 18 రోజులకు అమెరికాలో మనోజ్‌ గుండెపోటుతో మృతిచెందాడు. భర్త మరణ వార్త తెలిసిన సాహితి తీవ్ర మనోవేదనకు గురైంది. అమెరికా నుంచి మనోజ్‌ మృతదేహాన్ని ఈనెల 23న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

బుధవారం వనస్థలిపురంలో మనోజ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత సాహితి అంబర్‌పేటలోని పుట్టింటికి వెళ్లింది. భర్త అంత్యక్రియలు ముగిసినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉన్న సాహితి బుధవారం రాత్రి తన చెల్లెలు సంజనతో కలిసి పడుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో సాహితికి తోడుగా ఉన్న సంజన వాష్‌ రూమ్‌కు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపే సాహితి గది తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చెల్లెలు సంజన తిరిగి వచ్చి తలుపు కొట్టినా ఎంతకీ తలుపులు తీయలేదు. కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే చీరతో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త అంత్యక్రియలు ముగిసిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో అంబర్‌పేట డీడీ కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. సాహితి మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.


Updated Date - 2023-05-26T04:17:08+05:30 IST