పత్తి విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు

ABN , First Publish Date - 2023-06-14T01:10:35+05:30 IST

వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభమైంది. వేసవిలో కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్ని సిద్ధం చేసి పెట్టిన రైతులు రోహిణి, మృగశిర కార్తెల్లో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఇప్పుడు దుక్కులు దున్నుతున్న రైతులు మరోమారు వర్షం కురిస్తే విత్తనాలు విత్తేందుకు పత్తి విత్తనాలు కొని సిద్ధంగా ఉంచుకుంటున్నారు.

పత్తి విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు

కొన్ని రకాల విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు

అధిక ధరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయం

ఆన్‌లైన్‌లో బుక్‌ చేద్దామన్నా నోస్టాక్‌ చూపుతున్న వైనం

మోత్కూరు: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభమైంది. వేసవిలో కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్ని సిద్ధం చేసి పెట్టిన రైతులు రోహిణి, మృగశిర కార్తెల్లో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఇప్పుడు దుక్కులు దున్నుతున్న రైతులు మరోమారు వర్షం కురిస్తే విత్తనాలు విత్తేందుకు పత్తి విత్తనాలు కొని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. మంచి దిగుబడి వస్తుందని భావిస్తున్న కొన్ని రకాల పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

మార్కెట్లో సుమారు వందల రకాల కంపెనీల పత్తి విత్తనాలు ఉన్నాయి. పత్తి విత్తనాల ప్యాకె ట్‌ ధర రూ.853. కొన్ని కంపెనీల విత్తనాలను అండర్‌ సేల్‌ (ఎమ్మార్పీ కంటే తక్కువ)కు విక్రయిస్తుండగా, మరికొన్ని రకాల పత్తి విత్తనాలను ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారు. రైతుల నమ్మకాన్ని బట్టి ఎక్కువ మంది రైతులు అడిగిన పత్తి విత్తనాలను వ్యాపారులు స్టాక్‌ లేదంటూ బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. యూఎస్‌ అగ్రీసీడ్స్‌కు చెందిన యూఎస్‌-7067, 4708, నాథ్‌ సీడ్స్‌కు చెందిన సాకేత్‌ రకాల పత్తి విత్తనాలు దుకాణాల్లో దొరకడం లేదు. రూ.853 విక్రయించాల్సిన ఈ విత్తనాలను బ్లాక్‌ మార్కెట్లో రూ.1,200 నుంచి రూ.2,000 వరకు కూడా విక్రయిస్తున్నట్టు సమాచారం. అన్ని బీటీ-2 విత్తనాలే అయినా యూట్యూబ్‌ల్లో జరిగే ప్రచారంతో రైతులు ఆయా కంపెనీల విత్తనాలపై నమ్మకాన్ని పెంచుకుని వాటినే అడుగుతుండటంతో వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. యాదాద్రి జిల్లాలో మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), వలిగొండ తదితర మండలాల్లో ఈ విత్తనాలకు బాగా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం దుకాణాల్లో ఈ విత్తనాలు లభించడం లేదు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో సైతం ఈ విత్తనాలకు డిమాండ్‌ ఉంది. మోత్కూరు, గుండాల దుకాణాల్లో అడిగినా యూఎస్‌ అగ్రిసీడ్స్‌, సాకేత్‌ పత్తి విత్తనాలు దొరకలేదని, నేరుగా కంపెనీ ద్వారా తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో బుక్‌ చేద్దామన్నా నోసా ్టక్‌ చూపుతున్నారని మోత్కూరుకు చెందిన పత్తి రైతు మర్రి మధు తెలిపాడు. బ్లాక్‌ మార్కెట్లో ఒక్కో ప్యాకెట్‌ రూ.2,000 వేల వరకు విక్రయిస్తున్నారని తెలిసి ఆ విత్తనాల జోలికెళ్లకుండా వేరే కంపెనీ విత్తనాలు కొనుగోలు చేశానని అతడు తెలిపాడు.

విత్తన ఉత్పత్తిని తగ్గించిన కంపెనీలు

పత్తి సాగు ఏటా పెరుగుతున్నా విత్తన కంపెనీలు మాత్రం విత్తనాల తయారీని తగ్గించాయని సీడ్స్‌ దుకాణాల యజమానులు చెబుతున్నారు. గతంలో కంపెనీలు ముందుగా సీడ్‌ సరఫరా చేసి విక్రయించిన తరువాత డబ్బు తీసుకునే వారని, ఇప్పుడు ముందుగా చెల్లించిన డబ్బు మేరకే విత్తనాలు ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. గతంలో విక్రయించకుండా మిగిలిన ప్యాకెట్లను వాపసు తీసుకునే వారని, ప్రస్తుతం కంపెనీలు వాపసు తీసుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తంగా కంపెనీలు విత్తన ఉత్పత్తిని తగ్గించడం, కొన్ని రకాల విత్తనాలనే రైతులు అధికంగా అడుతుండటంతో డిమాండ్‌ ఏర్పడి విత్తనాల కొరత వచ్చిందని వారు పేర్కొంటున్నారు.

బ్లాక్‌లో పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : వెంకటేశ్వర్‌రావు, ఆలేరు ఏడీఏ

సీడ్స్‌ దుకాణాల యజమానులు ఏ విత్తనాలు ఎన్ని ఉన్నాయనేది ప్రతీ రోజు స్టాక్‌ బోర్డుపై రాయాలి. ఎవరైనా పత్తి విత్తనాలను ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే స్థానిక వ్యవసాయాధికారుల దృష్టికి గానీ, నేరుగా తన దృష్టికి గానీ తీసుకురావాలన్నారు. స్టాక్‌ బోర్డుపై స్టాక్‌ చూపించకుండా, దుకాణాల్లో విక్రయించకుండా బ్లాక్‌ మార్కెట్లో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-06-14T01:10:35+05:30 IST