సంక్షోభంలో ఆసిఫాబాద్ జిల్లా పత్తి రైతులు
ABN , First Publish Date - 2023-01-23T22:40:32+05:30 IST
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): పత్తి రైతు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మొదట్లో అధిక వర్షాలు దెబ్బతీస్తే, ఇప్పుడు పండిన కాస్త పంటకు కూడా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో క్వింటాలుకు రూపాయలు పదివేలు పలికింది.
-ఇళ్లలోనే నిల్వలు
-రూ.7500కు పడిపోయిన ధర
-ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన కొనుగోలు పది శాతమే
-ధరల తగ్గుదలతో కుదేలైన కౌలు రైతు
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్):
పత్తి రైతు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మొదట్లో అధిక వర్షాలు దెబ్బతీస్తే, ఇప్పుడు పండిన కాస్త పంటకు కూడా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో క్వింటాలుకు రూపాయలు పదివేలు పలికింది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సరుకు వస్తున్న కొద్ది ధరలు పాతాళానికి చేరుకోవడంతో రైతులు అటు పంటను అమ్ముకోలేక, ఇటు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చుకోలేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకొని పత్తిసాగు చేసిన కౌలురైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వర్షాల దెబ్బకు రెండేసి దఫాలు విత్తనాలు నాటి, ఎరువులు వేస్తే ఒక్కొక్క ఎకరాపై రూ.25వేల నుంచి రూ.35వేల పెట్టుబడి వ్యయం అయింది. అయితే ఆరంభంలో క్వింటా పత్తి పదివేలు ధర పలకడంతో కనీసం పెట్టుబడి అయినా తిరిగి వస్తుందని కౌలు రైతులు ఆశించారు. అయితే పంట చేతికొచ్చే సమయానికి ధరలు తగ్గుతుండటంతో పత్తిని విక్రయించాలా వద్ద అన్న మీమాంసంలో కొట్టు మిట్టాడుతున్నారు. మరోవైపు సొంత భూమి కలిగిన రైతులు కూడా పత్తి పంట సాగు చేసిన ఎకరాకు రూ.20వేల పెట్టుబడి పెట్టినట్టు చెబుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఎకరాకు 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 3,4క్వింటాళ్లకే పరిమితమైంది. విత్తనాలు, ఎరువులు కూలీల ఖర్చులను లెక్కిస్తే వచ్చిన దిగుబడి, మార్కెట్‌లో ధరలు బేరీజు వేసి చూస్తే పెట్టుబడిలో మూడోవంతు కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ధరలు తగ్గుతుండటంతో ఈ పాటికే పూర్తి కావాల్సిన కొనుగోలు కాస్త కేవలం పదిశాతం మించలేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 11శాతం తేమ కలిగిన టాప్ క్వాలిటీ పత్తి ధర అత్యధికంగా రూ.8800 పలుకుతుండగా 12శాతం తేమ కలిగిన పత్తి క్వింటా రూ.8వేలు, సీ గ్రేడు పత్తి రూ.7900 చొప్పున ధర పలుకుతోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లాలో చాలా మట్టుకు రైతులు ఇండ్ల వద్దనే చిన్నచిన్న ట్రేడర్లకు కాంటా పెట్టి విక్రయిస్తుండటంతో దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న ప్రయివేటు వ్యాపారులు నాణ్యతను సాకు చూపించి రూ.7500నుంచి రూ.7800 లోపే చెల్లిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో రైతులు పత్తి నిల్వలను మార్కెట్‌కు తెచ్చి విక్రయించే సంప్రదాయం లేకపోవటం వల్లే ధరల సమస్యను ఎదుర్కొంటున్నారన్నది జిన్నింగ్ మిల్లర్ల వాదన. అయితే నాణ్యత తక్కువ ఉన్న ఉత్పత్తికి మాత్రమే తక్కువ ధర లభిస్తోందన్నది మార్కెటింగ్ అధికారులు చెబుతున్న మాట. ధరల తగ్గుదలతో ఆందోళనకు గురైన రైతాంగం కడుపు మండి ఇటీవల ఆసిఫాబాద్, వాంకిడి తదితర ప్రాంతాల్లో రోడ్డు ఎక్కి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో ఒకటిరెండు రోజులు ధరలు పెంచినట్లే పెంచి మళ్లీ తగ్గించడం వెనుక వ్యాపారుల సిండికేట్ ముఖ్య భూమిక పోషిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా దీనిపై దృష్టి సారించటం లేదన్నది రైతులు ప్రధాన ఆరోపణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తి పంటే నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. పింజ శాతంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తి ఉత్పత్తి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కానీ ప్రతి ఏటా విక్రయాల సీజన్‌లో వ్యాపారులు అధికారులు కుమ్మక్కై ధరల తగ్గుదలకు కారణం అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయిు.
ఇప్పటి వరకు విక్రయించింది పది శాతమే..
ఆసిఫాబాద్ జిల్లాలో 95శాతం విస్తీర్ణంలో పత్తి పంటే సాగవుతుంది. ఐదు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో మొత్తం 21లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, వాతావారణ పరిస్థితుల కారణంగా రెండేళ్లలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దాంతో అధికారులు అంచనాలను కుదించి జిల్లా సగటు దిగుబడులను 18 లక్షల క్వింటాళ్లకు తగ్గించగా ఈ యేడాది దానిని మరో నాలుగు లక్షలు తగ్గించి 14 లక్షల క్వింటాళ్లు మాత్రమే రావచ్చని అంచనా వేశారు. అయితే అధికారులు అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 2.39లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. ఇందులోనూ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయివేటు వ్యాపారులు జిన్నింగ్ మిల్లులకు విక్రయించింది కేవలం 1.83లక్షల క్వింటాళ్లు మాత్రమే. 56,165 క్వింటాళ్ల పరిమాణంలో పత్తి నిల్వలు పొరుగున మహారాష్ట్రలో విక్రయించారు. దీన్ని బట్టి ధరల తగ్గుల ప్రభావం పత్తి విక్రయాలపై ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించవచ్చు. మార్చి, ఏప్రిల్ నాటికి ధరలు పెరగవచ్చనే అంచనాలు వ్యక్తమవుతుండటంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ముందుకు రావటం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.