Congress leaders : బీజేపీలోకి కాంగ్రెస్‌ నేతలు

ABN , First Publish Date - 2023-07-30T02:43:06+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిదులు బీజేపీ బాట పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా దివంగత నేత బాగారెడ్ది తనయుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి,

Congress leaders  : బీజేపీలోకి కాంగ్రెస్‌ నేతలు

మాజీ ప్రజాప్రతినిధుల కాషాయ తీర్థం

మాగం రంగారెడ్డి, ఆకుల రాజేందర్‌, బాగారెడ్డి కుమారుడు జైపాల్‌రెడ్డి చేరిక

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిదులు బీజేపీ బాట పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా దివంగత నేత బాగారెడ్ది తనయుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి శనివారం ఢిల్లీలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కే లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన వారు బీజేపీలో చేరారని, దీంతో మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో తమ పార్టీ మరింత బలపడుతుందన్నారు. మరిన్ని చేరికలు ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పారు. కాగా, జహీరాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని జైపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రె్‌సకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంజీవరావు 1983లో చెన్నూరు నుంచి అప్పటి రాష్ట్రీయ సంజయ్‌ విచార మంచ్‌ (మేనకా గాంధీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో అప్పటి ప్రభుత్వం రద్దు కావడంతో రెండేళ్లకే పదవిని కోల్పోయారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. కాగా, అమరాజుల శ్రీదేవి 2004లో బెల్లంపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు.

జయసుధతో బీజేపీ నేతల చర్చలు..

సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆమెతో బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. గతంలోనూ జయసుధను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో తనకు పరిచయం ఉన్న నేతలతో జయసుధ టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపఽథ్యంలోనే ఆయన జయసుధతో చర్చించినట్లు సమాచారం. జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపాందారు. 2014లోనూ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమె బీజేపీలో చేరితే మళ్లీ సికింద్రాబాద్‌ నుంచే బరిలోకి దించే యోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నేడు మోరంచపల్లికి కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఈ గ్రామంలో ఆయన పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు.

Updated Date - 2023-07-30T02:43:06+05:30 IST