బొగ్గు గని అధికార్ల సమ్మె హెచ్చరిక
ABN , First Publish Date - 2023-06-26T04:04:57+05:30 IST
వేతన సవరణలోని వైరుద్ధ్యాలను తొలగించకపోతే సమ్మె చేస్తామని కోల్ ఇండియా అధికారులు ఆదివారం హెచ్చరించారు....
కార్మికుల కన్నా జీతాలు తగ్గుతున్నాయని ఆందోళన
కోల్‌కతా, జూన్ 25: వేతన సవరణలోని వైరుద్ధ్యాలను తొలగించకపోతే సమ్మె చేస్తామని కోల్ ఇండియా అధికారులు ఆదివారం హెచ్చరించారు. బొగ్గు గని కార్మికులు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతన సవరణపై కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ అమోదం తెలిపింది. దాని ప్రకారం బేసిక్‌లో కనీసం 19 శాతం, అలవెన్స్‌ల్లో 25 శాతం పెరుగుదల కనిపించింది. అధికారుల వేతనాలపై మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీనివల్ల కార్మికుల జీతాల కన్నా తమకు తక్కువ వచ్చే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్ (ఏఐఏసీఈ) సంఘం అభిప్రాయపడింది. అందువల్ల పర్సనల్ పే ప్యాకేజీని అమలు చేసి తమ వేతనాలకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ మేరకు కోల్ ఇండియా చైర్మన్‌కు లేఖ రాసింది. దీనిపై వెంటనే చర్యలు ప్రారంభించి, సెప్టెంబరు 30 నాటికి సమస్యను పరిష్కరించాలని కోరింది. లేకుంటే వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు అవసరమైతే చివరకు సమ్మెకు దిగుతామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పి.కె.సింగ్ రాథోడ్ తెలిపారు.