Governor Vs CM: దిగొచ్చిన కేసీఆర్ సర్కారు

ABN , First Publish Date - 2023-01-30T15:12:23+05:30 IST

బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోటే మొదలౌతాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

Governor Vs CM: దిగొచ్చిన కేసీఆర్ సర్కారు
CM KCR Strategically withdraws petition in HC over Governor Tamilisai speech in assembly, nrao

హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోటే మొదలౌతాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్‌ను విమర్శించవద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు. హైకోర్టు సూచనతో ప్రభుత్వ న్యాయవాది, గవర్నర్ న్యాయవాది చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొంత కాలంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడంతో గవర్నర్‌ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాకపోవడమే సర్కారు నిర్ణయానికి కారణమైంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉన్నందున.. అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్‌ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. పైగా గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్‌ కమ్యూనికేషన్‌ వెళ్లింది. బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్‌ కార్యాలయం సర్కారును కోరింది.

దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్‌ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేను అందుకోసం రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరనుంది.

ఈ నెల 21నే ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ పంపినా గవర్నర్‌ ఆమోదం తెలకపోవడంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగపరమైన విధి అని, గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? ఉండదా? అనేది అత్యవసరం కాదని అంటున్నాయి. ఈ రెండూ పరస్పరం విరుద్ధమైన అంశాలని, ఒకదానితో మరొకటి పోల్చడం సరికాదని వాదిస్తున్నాయి. రాజ్యాంగంలో ఎక్కడా గవర్నర్‌ ప్రసంగించాలన్న విషయం లేదని పేర్కొంటున్నాయి. ఆర్టికల్‌ 202 ప్రకారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ కచ్చితంగా ఆమోదం తెలపాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. ఆమోదం తెలపకపోవడమనేది రాజ్యాంగాన్ని కించపరచడం, రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియకు ఆటంకం కలిగించడమే అవుతుందని ఆ వర్గాలు అంటున్నాయి. గవర్నర్‌ వ్యవహారశైలి వల్ల రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇతరత్రా విషయాల్లో గవర్నర్‌ తన విచక్షణను ప్రదర్శించవచ్చని, కానీ.. బడ్జెట్‌ ఆమోదం లాంటి విషయంలో మాత్రం గవర్నర్‌ విచక్షణ ప్రదర్శించే అవకాశం లేదని అంటున్నాయి. కాగా, ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌ సందర్భంగా కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రవేశపెట్టింది.

అయినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజాపద్దును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు ఆమోదం తెలిపానని గవర్నర్‌ తమిళిసై గతంలో వెల్లడించారు. కానీ, ఈసారి మాత్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకే ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయుంచింది. అయితే గవర్నర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనది కావడంతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే.

గవర్నర్‌పై చర్యలకు రాష్ట్ర హైకోర్టు చర్యలు తీసుకుంటుందని ఊహించిన కేసీఆర్ సర్కారు చివరి క్షణంలో వెనకడుగు వేసింది. తద్వారా గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య సయోద్య కుదిరింది.

Updated Date - 2023-01-30T16:01:27+05:30 IST