Share News

CM Car Delivery ' : సీఎం కార్ల డెలి‘వర్రీ’!!

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:32 AM

తెలంగాణ సీఎం కార్ల బుల్లెట్‌ ప్రూఫింగ్‌, అప్‌గ్రేడేషన్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది.

CM Car Delivery ' : సీఎం కార్ల డెలి‘వర్రీ’!!

ఇప్పటికి మూడు కార్లకే మోక్షం...

టెస్టింగ్‌ కోసం కేరళకు ఓ కారు..

మిగిలిన కార్లన్నీ ప్లాంట్‌లోనే..

8 వాటిల్లో 9 కార్ల పనులు మొదలు

8 పనులు మొదలవ్వని మిగతా 9 కార్లు

విజయవాడ/గన్నవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కార్ల బుల్లెట్‌ ప్రూఫింగ్‌, అప్‌గ్రేడేషన్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. టయోటా కంపెనీకి చెందిన ల్యాండ్‌ క్రూయిజర్లు ఇప్పుడప్పుడే డెలివరీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. 22 కార్లలో కేవలం నాలుగింటికి మాత్రమే బుల్లెట్‌ప్రూఫింగ్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, ఇతర సాంకేతిక వ్యవస్థ అనుసంధానం జరిగింది. వాటిల్లో మూడు కార్లను సీఎంవోకు డెలివరీ చేయగా.. మరోకారును టెస్టింగ్‌ నిమిత్తం కేరళకు తరలించారు. మిగతా 18 కార్లు వీరపనేనిగూడెంలోని త్రిహాయని ఇంజనీరింగ్‌ వర్క్స్‌లోనే ఉన్నాయి. వీటిల్లో తొమ్మిదింటిని విడదీయలేదు. కేవలం 9 కార్లకు మాత్రమే ప్రస్తుతం బుల్లెట్‌ ప్రూఫ్‌, ఇతర సాంకేతిక పనులు జరుగుతున్నాయి. ఈ 9 కార్లను మాత్రమే పూర్తిగా డోర్లతో సహా విడదీసి పక్కన పెట్టారు. బానెట్లను కూడా పూర్తిగా తొలగించారు. ఆ కార్ల స్ట్రక్చర్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. త్రిహాయని ఇంజనీరింగ్‌ వర్క్స్‌లో పనిచేస్తున్న నిపుణులంతా కేరళకు చెందినవారే కావడం గమనార్హం..!

రేవంత్‌ ప్రెస్‌మీట్‌ తర్వాత..

తెలంగాణ సీఎం కార్ల కాన్వాయ్‌ బుల్లెట్‌ప్రూఫింగ్‌ పనులు ఏడాది కాలంగా కొన‘సాగుతున్నాయి’. తొలుత 10 మంది నిపుణులు పనిచేసేవారు. ఆ తర్వాతికాలంలో ఐదుగురు నిపుణులకే బాధ్యతలు అప్పగించడంతో పనులు నత్తనడకన సాగాయి. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో ఈ వాహనాల గురించి ప్రస్తావించాక.. పనుల్లో కొంత వేగం పుంజుకుంది. అయితే.. ఇప్పుడప్పుడే కార్ల డెలివరీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే.. ఈ ప్లాంట్‌లోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా త్రిహాయని యాజమాన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్లకు సంబంధించి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడంతో స్థానికులు ప్లాంట్‌ సందర్శనకు వస్తుండడంతో యాజమాన్యం భద్రతను పెంచింది. 25 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టగా.. సిబ్బందిని కూడా తమ సెల్‌ఫోన్లను లోనికి తీసుకెళ్లనివ్వడం లేదు.

ఆలస్యానికి కారణమిదే..?

ఏడాది కాలంగా తెలంగాణ సీఎం కాన్వాయ్‌ కార్ల పనులు కొనసాగడానికి పలు కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంస్థ ఆర్థిక ఇబ్బందులతో వనరుల లేమి సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అన్నింటికీ మించి.. గతంలో ఈ సంస్థ మిత్ర కంపెనీ, జాపన్‌కు చెందిన క్యూకుటో కంపెనీతో కలిసి పనిచేసేది. ఈ ఒప్పందం నుంచి క్యూకుటో తప్పుకోవడంతో.. భారమంతా మిత్రపైనే పడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు మిత్ర బకాయిపడడంతో.. ప్లాంట్‌ను సీజ్‌ చేశారు. బ్యాంకు సెక్యూరిటీ కింద కూడా ఈ ప్లాంట్‌కు పహారా కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు.. అనుమతుల లేమి కూడా కార్ల బుల్లెట్‌ ప్రూఫింగ్‌ నెమ్మదించేందుకు కారణమవుతున్నట్లు సమాచారం. గతంలో మిలటరీ బస్సులకు బుల్లెట్‌ ప్రూఫింగ్‌ పనులను ఈ సంస్థ చేసేది. కేసీఆర్‌ సర్కారు కొలువుదీరిన తొలినాళ్లలో ఆయన కాన్వాయ్‌లోని 18 ఫార్చ్యునర్‌ కార్లకు కూడా ఈ సంస్థే బుల్లెట్‌ ప్రూఫింగ్‌ చేసింది. మిత్ర సంస్థకు అనుమతి లేకుండానే.. అప్పట్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ పనులు చేసినట్లు తెలిసింది. ల్యాండ్‌ క్రూయిజర్లు వచ్చాకే.. ఈ సంస్థ అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.

జగన్‌ 10 కార్లకూ ఇక్కడే..!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆయన కాన్వాయ్‌లోని 10 కార్లకు తిహాయని సంస్థే బుల్లెట్‌ ప్రూఫింగ్‌ చేసింది. అప్పటికి కూడా ఈ సంస్థకు అనుమతులు లేకపోవడం గమనార్హం..! ఆ తర్వాత జగన్‌ సూచనలతోనే కేసీఆర్‌ కూడా తన కాన్వాయ్‌లోని వాహనాలకు ఇక్కడ బుల్లెట్‌ ప్రూఫింగ్‌ చేయించారు.

పవన్‌ కల్యాణ్‌కు మాత్రం నో..!

జగన్‌, కేసీఆర్‌ల కాన్వాయ్‌లలోని కార్లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ చేయటానికి అంగీకరించిన సంస్థ.. జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ కార్ల విషయంలో నిరాకరించడం గమనార్హం..! పవన్‌ కల్యాణ్‌ రెండు కార్లకు బుల్లెట్‌ ప్రూఫింగ్‌ చేయాలని కోరగా.. తమకు అనుమతులు రాలేదంటూ ఈ సంస్థ సున్నితంగా తిరస్కరించింది.

Updated Date - Dec 31 , 2023 | 04:32 AM