పౌరసత్వ వివాదం.. టికెట్‌ దూరం!

ABN , First Publish Date - 2023-08-22T03:17:19+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిటింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను కేసీఆర్‌ పక్కనపెట్టేశారు.

పౌరసత్వ వివాదం.. టికెట్‌ దూరం!

చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీ నర్సింహారావు

ఫేస్‌బుక్‌లో చెన్నమనేని నిర్వేదం

సిరిసిల్ల ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిటింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను కేసీఆర్‌ పక్కనపెట్టేశారు. పౌరసత్వ వివాదం కారణంగానే చెన్నమనేనికి టికెట్‌ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చివరి క్షణం వరకు టికెట్‌ తమ నాయకుడికే వస్తుందని భావించిన చెన్నమనేని అనుచరులు తీవ్ర నిరాశ చెందారు. 13 ఏళ్లుగా చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదం వివిధ కోర్టుల్లో కొనసాగుతుండగా.. కొద్ది నెలల క్రితం రాష్ట్ర హైకోర్టులో తుది విచారణ పూర్తయిందని, తీర్పును రిజర్వులో ఉంచారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినట్లు భావిస్తున్నారు.

రెండేళ్ల కిందటే పార్టీలోకి..

చల్మెడ లక్ష్మీనర్సింహారావు తండ్రి సి.ఆనంద్‌రావు కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 1985లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీనర్సింహారావు తండ్రి తరఫున చురుకుగా పనిచేశారు. తర్వాత ఆయన 2007లో కాంగ్రెస్‌ పక్షాన ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2009, 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2021 డిసెంబరులో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు.

రాజకీయాలు ప్రజల కోసమే: చెన్నమనేని

సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి ముందే.. చెన్నమనేని రమేశ్‌బాబు నిర్వేదంతో ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తన కూతురు సంగీత ఎంబీబీఎస్‌ పట్టా తీసుకొని, డాక్టరమ్మ అయ్యిందని చెబుతూనే టికెట్‌ దక్కకపోవడంపై పరోక్షంగా తన అసంతృప్తిని వెల్లగక్కారు. రాజకీయాలు ప్రజల కోసమే చేయాలని, పదవుల కోసం కాదని చెప్పిన తన తండ్రి చెప్పేవారని గుర్తుచేశారు. ఆ మాటలను సర్మించుకంటూ తన తుదిశ్వాస దాకా దాన్ని పాటిస్తానన్నారు. ‘‘నాతో ఉన్నవారికి భరోసా ఇస్తున్నాను. దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి, మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి. లేనిపక్షంలో అత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న పాఠం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-22T03:17:19+05:30 IST