Share News

తెలుగులో ‘చాట్‌ జీపీటీ’

ABN , First Publish Date - 2023-11-17T05:39:06+05:30 IST

కృత్రిమ మేథ(ఏఐ), లాంగ్వేజ్‌ మోడల్‌, జనరేటివ్‌ ప్రీ-ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.. వెరసి ఇంటర్నెట్‌ ప్రపంచంలో సంచలనం.

తెలుగులో ‘చాట్‌ జీపీటీ’

‘స్వేచ్ఛ’ ఐటీ సంస్థ తొలి అడుగు

10వేల మంది టెకీల భాగస్వామ్యం

2 నెలల్లో అందరికీ అందుబాటులోకి

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేథ(ఏఐ), లాంగ్వేజ్‌ మోడల్‌, జనరేటివ్‌ ప్రీ-ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.. వెరసి ఇంటర్నెట్‌ ప్రపంచంలో సంచలనం. కోరిన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఓపెన్‌ఏఐ రూపకల్పన అయిన చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా క్రియాశీల వినియోగదారులున్నారు. అయితే.. అనాలిటిక్‌ భాషలతో పోలిస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీటీలు భారతీయ భాషల్లాంటి సింథటిక్‌ లాంగ్వేజె్‌సలో మాత్రం పెద్ద పురోగతిని సాధించలేదు..! తెలుగులో జీపీటీ వెలితి భర్తీ కానేలేదు. ఇతర భారతీయ భాషలదీ అదే పరిస్థితి..! ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు ‘ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా’ ముందుకొచ్చింది. ఆ సంస్థ నుంచి ఉద్భవించిన ‘స్వేచ్ఛ ఐటీ సంస్థ’ ఈ దిశగా గురువారం తొలి అడుగు వేసింది. భారతీయ భాషలు.. ప్రధానంగా తెలుగులో ఉచితంగా చాట్‌జీపీటీ మాదిరి సేవలందించేందుకు నడుంబిగించింది. ఈ మహా క్రతువులో ఏకంగా 10 వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. డేటాథాన్‌ పేరుతో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 10 ఐటీ కంపెనీల ఉద్యోగులు, 25 ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. రెండు నెలల్లో చాట్‌జీపీటీ తరహాలో ఏఐ, జీపీటీల కలయికతో తెలుగు వెబ్‌సైట్‌, యాప్‌ సిద్ధమవుతుందని, తెలుగు టెక్స్ట్‌, వాయిస్‌ కమాండ్స్‌ ఆధారంగా దీనిని ఎవరైనా సులభంగా వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నామని స్వేచ్ఛ ప్రతినిఽధులు కిరణ్‌ చంద్ర, ప్రవీణ్‌ తెలిపారు.

Updated Date - 2023-11-17T05:39:20+05:30 IST