Share News

ఏపీ కష్టాలు పోవాలంటే చంద్రబాబు రావాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:36 AM

ఏపీ ప్రజల కష్టాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఏపీ కష్టాలు పోవాలంటే చంద్రబాబు రావాలి

ఆయన ఓ విజన్‌తో పని చేసే వ్యక్తి

‘డీ కోడింగ్‌ ద లీడర్‌’ పుస్తక ఆవిష్కరణలో ఎంపీ రఘురామరాజు

ప్రపంచంతో పోటీపడే వ్యక్తి చంద్రబాబు : బుద్ధ ప్రసాద్‌

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రజల కష్టాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఓ విజన్‌తో పని చేస్తారని పేర్కొన్నారు. డాక్టర్‌ పెద్ది రామారావు రచించిన ‘డీ కోడింగ్‌ ద లీడర్‌’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పెద్ది రామారావు రచించిన పుస్తకం చదివితే చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో అర్థం అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌ ప్రగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టానని,. సైబరాబాద్‌ను చూేస్త ఆయన పడిన కష్టం తెలుస్తుందని తెలిపారు. టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో (నరేగా) కింద రికార్డు స్థాయిలో రోడ్లు వేశారని అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలను కలిపే వంతెన నిర్మాణం చంద్రబాబు చేతులమీదుగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అన్నారు. చంద్రబాబును అర్థం చేసుకోవడంలో కార్యకర్తలు, ప్రజలు విఫలం అవుతున్నారని వాపోయారు. ‘డీ కోడింగ్‌ ద లీడర్‌’ పుస్తకం చదివితే చంద్రబాబు అంటే ఏంటో తెలుస్తుందన్నారు. చంద్రబాబు అందరిలాంటి వ్యక్తి కాదని, పక్క రాష్ట్రంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేందుకు ఆలోచనలు చేస్తుంటారని పేర్కొన్నారు. చంద్రబాబు అనుకున్నట్టుగా అమరావతి నిర్మాణం జరిగి ఉంటే.. ప్రపంచంలోనే అలాంటి మహా నగరం మరొకటి ఉండేది కాదన్నారు. పుస్తక రచయిత పెద్ది రామరావును రఘురామ, బుద్ద ప్రసాద్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Dec 17 , 2023 | 06:47 AM